చంద్రబాబు మీద విపరీతమైన అభిమానాన్ని చూపించే విజయవాడ ఎంపీ కేశినేని నాని.. మరికొన్ని సందర్భాల్లో ఆయనపై తనకున్న ఆగ్రహాన్ని వెల్లడించేందుకు.. ఓపెన్ అయ్యేందుకు ఏ మాత్రం వెనుకాడరు. ఇటీవల కాలంలో బాబుతో పొసగక.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చేయటమే కాదు.. తన కుమార్తె కూడా బరిలో ఉండదని చెప్పటం తెలిసిందే. ఇదిలా ఉంటే..తాజాగా ఆయన తన పార్టీ ఆఫీసులో చేసిన మార్పు హాట్ టాపిక్ గా మారింది.
విజయవాడలోని తన ఆఫీసుబయట గోడకు చంద్రబాబు ఫోటో ఉండేది. ఇటీవల కాలంలో బాబు మీద గుస్సాగా ఉన్న కేశినేని.. తాజాగా ఆయన ఫోటో స్థానంలో వ్యాపార దిగ్గజం రతన్ టాటాతో ఉన్న ఫోటోను ఏర్పాటు చేయటం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. తన పార్టమెంటరీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు.. వాటి ఇన్ ఛార్జుల ఫోటోలతో పాటు.. ఇతర ముఖ్యనేతల ఫోటోల్ని కూడా తొలగించేశారు.
అదే సమయంలో చంద్రబాబు ఫోటో స్థానే.. రతన్ టాటా ఫోటోను ఏర్పాటు చేశారు. అదే సమయంలో టాటా ట్రస్టు.. తన ఎంపీ నిధులతో గతంలో తాము చేసిన సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు తెలిసేలా ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేశారు. దీంతో.. ఇంతకాలం కేశినేని వర్సెస్ బాబు మధ్య సమ్ థింగ్ తేడా వచ్చిందన్న ప్రచారం తాజాగా ఆధారాలతో సహా నిజమైందన్న మాట వినిపిస్తోంది.
మరి.. కేశినేని తాజా అడుగులు ఏటువైపున అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొందరు బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉందన్న మాటను చెబుతున్నారు. బాబుకు అత్యంత సన్నిహితులైన సుజనా చౌదరి.. సీఎం రమేశ్.. టీజీ వెంకటేశ్ లాంటి వారు బీజేపీలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో కేశినేని సైతం అలాంటి నిర్ణయమే తీసుకుంటారా? మరేదైనా ఉంటుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.