కొన్ని విషయాల్లో సంప్రదాయ రాజకీయ నాయకులతో పోలిస్తే భిన్నంగా వ్యవహరిస్తుంటాడు జనసేనాని పవన్ కళ్యాణ్. ప్రతి దాన్నీ రాజకీయం, ఓట్ల కోణంలో చూడకుండా మంచి పనులు చేయడానికి అతను ముందుకొస్తుంటాడు. అలా ఆలోచించేవాడే అయితే.. సైన్యం కోసమని.. వరద బాధితుల కోసమని కోట్ల రూపాయల విరాళాలు ఇవ్వడు. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినపుడు స్పందించడమే కాక.. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా, తనను సంప్రదించినా వెంటనే సాయం అందజేయడం చాలాసార్లు చూశాం.
ఇప్పుడు పవన్ ఓ గొప్ప పనికి శ్రీకారం చుట్టాడు. జనం మరిచిపోతున్న ఓ గొప్ప నాయకుడిని తర్వాతి తరాలు గుర్తుంచుకునేలా.. ఆయన ఇంటిని స్మారక చిహ్నంగా మలచడానికి కోటి రూపాయల నిధిని కేటాయించాడు జనసేనాని. ఆ నాయకుడు ఎవరో కాదు.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య.
కర్నూలు జిల్లాలో పేద, దళిత కుటుంబంలో పుట్టిన దామోదరం సంజీవయ్య.. మన దేశంలోనే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తొలి దళిత నేతగా ఘనత వహించారు. 1960-62 మధ్య ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశంలోనే గొప్ప రాజకీయ నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న సంజీవయ్యను మరణానంతరం అందరూ మరిచిపోయారు. సంజీవయ్య తర్వాతి తరం వారు కూడా పట్టించుకోకపోవడంతో ఇల్లు కూలిపోయి, ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ పాడైపోయిన స్థితి గురించి తెలుసుకున్న జనసేనాని.. సంజీవయ్య ఇంటిని, ఆయన వస్తువులను కాపాడి తర్వాతి తరాలకు ఆయన గురించి తెలియజెప్పే ప్రయత్నానికి పూనుకున్నాడు.
ఇందుకోసం కోటి రూపాయల నిధిని కేటాయిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా సంజీవయ్య గొప్పదనాన్ని చాటే కొన్ని విషయాలను కూడా పవన్ ట్విట్టర్లో పంచుకున్నాడు. ఒక గొప్ప నేత గురించి తర్వాతి తరాలకు తెలియజెప్పాలనే పవన్ ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates