విద్యుత్ దుమారం.. టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ.. ఎవ‌రికి లాభం..?


ఏపీలో ఒక‌దాని త‌ర్వాత‌.. ఒక‌టి ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారాయి. కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు ఎస్సీలపై దాడులు.. రాష్ట్రంలో ప్ర‌ధాన వార్త‌గా మారింది. త‌ర్వాత హిందూ ఆల‌యాల‌పై దాడులు.. ప్ర‌భుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. త‌ర్వాత‌.. టీడీపీ నేత‌ల‌పై కేసులు.. స‌ర్కారును ఊపిరి ఆడ‌కుండా చేసింది. ఇలా.. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త వివాదాలు.. విమ‌ర్శ‌ల‌తో జ‌గ‌న్ ప్ర‌భుత్వం స‌మ‌స్య‌లు ఎదుర్కొంటూనే ఉంది. తాజాగా అప్పుల విష‌యం.. రాష్ట్రాన్ని దేశంలోనే ముందుకు తీసుకువెళ్లింది. ఇదిలావుంటే.. ఇప్పుడు తాజాగా విద్యుత్ స‌మ‌స్య రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారింది.

రాష్ట్రంలో విద్యుత్ కోత‌లు.. మొద‌ల‌య్యాయ‌ని.. ప్ర‌భుత్వానికి ముందు చూపు లేక పోవ‌డంతోనే ఇలా జ‌రిగింద‌ని.. టీడీపీ నేత‌లు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నారు. నిజానికి గ‌త కొన్నాళ్లుగా విద్యుత్ స‌మ‌స్య రాష్ట్రంలో ప్ర‌ధాన చ‌ర్చ‌గా మారింది. గ్రామాలు, ప‌ల్లెల్లో.. విద్యుత్ కోత‌లు స‌ర్వ‌సాధార‌ణంగా మారాయి. రైతుల‌కు ఉచిత విద్యుత్ ఇస్తున్నా.. అది కూడా ఎప్పుడు ఉంటుందో లేదో తెలియ‌ని ప‌రిస్థితి. మ‌రోవైపు.. ట్రూ అప్ చార్జీల పేరిట ప్ర‌భుత్వం పెంచిన చార్జీల‌పైనా ప్ర‌జ‌ల్లో చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు వ‌ర్షాకాలం నేప‌థ్యంలో సౌర‌విద్యుత్ త‌గ్గిపోయి.. ప‌వ‌న్ విద్యుత్ కూడా డేంజ‌ర్‌లో పడింది.

దీంతో ఈ ప‌రిస్థితిని టీడీపీ త‌న‌కు అడ్వాంటేజ్‌గా తీసుకుని.. విమ‌ర్శ‌లు సంధించ‌డం కామ‌న్‌. అయితే.. దీనికి కౌంట‌ర్‌గా .. మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి స‌హా.. ఇత‌ర నాయ‌కులు.. రాష్ట్రంలో విద్యుత్‌కు కొర‌తే లేద‌ని ప్ర‌క‌టించారు. అంతేకాదు.. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని కొట్టివేశారు. త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారిపై చ‌ర్యలు త‌ప్ప‌వని కూడా హెచ్చ‌రించారు. అయితే.. ప్ర‌భుత్వం ఎన్ని హెచ్చ‌రిక‌లు చేసినా.. రాష్ట్రంలో విద్యుత్ కోత‌లు కామ‌న్‌గా మారుతున్నాయ‌నే వాద‌న మాత్రం.. అధికార వ‌ర్గాల నుంచే వినిపిస్తోంది. ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చిన న‌ష్టం లేద‌ని అంటున్నా.. మున్ముందు మాత్రం స‌మ‌స్య‌లు త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు.

సో.. దీనిని గ‌మ‌నిస్తే.. టీడీపీ చెబుతున్న వాద‌న బ‌లంగా ప్ర‌జ‌ల‌లోకి వెళ్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వానికి ముందు చూపు లేద‌నే విష‌యాన్ని కేంద్రం కూడా ఇటీవ‌ల హెచ్చ‌రించింది. మున్ముందు క‌రెంటు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని.. హెచ్చ‌రిస్తూ.. ఓ లేఖ రాసింది. అయినా. కూడా జ‌గ‌న్ స‌ర్కార్ దీనిని ప‌ట్టించుకోకుండా.. వ్య‌వ‌హ‌రించిన తీరుతో ఇప్పుడు క‌ష్టాల ముంగిట ఏపీ నిలిచింద‌నేదివాద‌న‌. ఈ ప‌రిణామాల‌తో టీడీపీ వాద‌నే బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.