ఉద్యోగులను ఊరిస్తున్న పీఆర్సీ

ప్రతి ఐదేళ్లకోసారి ఉద్యోగులకు జీతాలు పెరగడమనేది పే రివిజన్ కమీషన్ (పీఆర్సీ) సిఫారసుల మీద ఆధారపడుంటుంది. ఇపుడా పీఆర్సీ అమలు విషయంపైనే ఉద్యోగులు, ఉద్యోగుల సంఘాల నేతలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కమిషన్ సూచనల ప్రకారం పూర్తిస్ధాయి పీఆర్సీ అమలు చేసే ముందు ప్రభుత్వం ఇంటెరిమ్ రిలీఫ్ (ఐఆర్) అమలు చేస్తుంది. ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఐఆర్ 27 శాతం 2019, జూలై నుంచి అమలు చేస్తోంది.

ఐఆర్ 27 శాతం అమలు చేస్తున్నపుడు ఇక పీఆర్సీ పూర్తిస్ధాయి సిఫారసులను ఎప్పుడు అమల్లోకి తెస్తుందన్నదే ఇపుడు కీలకమైంది. ఈ విషయం మీద ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్ చేస్తున్నది. నిజానికి అమల్లవాల్సిన 11 పీఆర్సీ చంద్రబాబునాయుడు హయాంలోనే అమలు చేసుండాలి. కానీ అప్పుడు అమల్లోకి రాకపోవటంతో ఇపుడు జగన్ మీద ఒత్తిడి పెరిగిపోతోంది.

పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, జీవన వ్యయం తదితరాలను పరిశీలనలోకి తీసుకుని పీఆర్సీని కమీషన్ సిఫారసుచేస్తుంది. నిజానికి పీఆర్సీని పెంచుకుంటూ పోయే కన్నా నిత్యావసరాల ధరలు తగ్గించాలని ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒకవైపు పీఆర్సీ రూపంలో జీతాలు పెరుగుతుంటే మరోవైపు నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి.

అంటే పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ఇతర వ్యవహారాల వల్ల పెరిగిన జీతాలు అక్కడికక్కడ సరిపోతుంది. దీంతో జీతాలు పెరిగిన సంతోషం కూడా ఉద్యోగులకుండదు. అదే ఇపుడున్న జీతాలను ఇలాగే ఉంచి నిత్యావసరాల ధరలను గనుక ప్రభుత్వం బాగా తగ్గించగలిగితే ఇపుడున్న జీతాల్లోనే అందరూ హ్యాపీగా ఉండచ్చు. కానీ ప్రభుత్వం నిత్యావసరాల ధరల తగ్గింపు విషయంలో ఫెయిల్ అవుతున్న కారణంగా జీతాలు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్న అశుతోష్ మిశ్రా ఏకసభ్య పీఆర్సీ కమీషన్ ప్రకారం 27 శాతం ఫిట్ మెంట్ సిఫారసు చేసినట్లు సమాచారం. అంటే ఇపుడు ఐఆర్ ఎంత అమలవుతోందో ఫిట్ మెంట్ అంతే సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. మరి పీఆర్సీ అమల్లో 27 శాతం కన్నా ఎక్కువ అమలవుతుందా లేదా అన్నదే ఇపుడు కీలకమైంది. పీఆర్సీని నవంబర్ లో అమలు చేస్తామని ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ హామీ ఇచ్చారు. మరి నిజంగానే నవంబర్ లో పీఆర్సీ అమలవుతుందా అన్నదే ఆసక్తిగా మారింది. చూద్దాం ప్రభుత్వం చివరకు ఏమి చేస్తుందో.