ఏపీలో మాత్రమే కరెంటు కోతలు ఎలా వచ్చాయి – చంద్రబాబు

ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు భారీ స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. పాత విష‌యాల జోలికి పోకుండా.. తాజా అంశాల‌పై ప‌దునైన వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు. “మీ క‌మీష‌న్ల కోసం.. రాష్ట్రాన్ని అంధ‌కారం చేస్తారా?” అంటూ.. నిల‌దీశారు. అంతేకాదు.. పేద‌ల ఇళ్ల పునాదుల కోసం .. కేంద్ర ప్ర‌భుత్వం.. 3700 కోట్లు ఇస్తే.. దానిలోనూ 2000 కోట్లు దిగ‌మింగేసి.. కోర్టులో కేసులు వేయించి.. ప‌నులు నిలుపుద‌ల చేయించిన దౌర్భాగ్య‌పు పాల‌న అని.. ధ్వ‌జ‌మెత్తారు. అంతేకాదు.. క‌మీష‌న్ల కోసం.. క‌క్కుర్తి ప‌డి.. విద్యుత్ విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అడ్డ‌దారులు తొక్కుతోంద‌ని.. తెలంగాణ‌కు లేని స‌మ‌స్య ఏపీకే వ‌చ్చిందా? అని నిల‌దీశారు.

అస‌లు ఏం జ‌రిగింది?

అప్పు చెల్లించకపోవడంతో ఏపీలో విండ్, సోలార్ పవర్ ప్లాంట్లు మూతపడ్డాయి. హైడల్ పవర్‌తో పాటు ఎన్టీటీపీఎస్ నుంచి వస్తున్న 15 వందల మెగావాట్లు.., బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్న విద్యుత్‌తో ప్రస్తుతం రాష్ట్రాన్ని నడుపుతున్నారు. కరోనా కారణంగా గృహ విద్యుత్ వినియోగం పెరుగుతూ వచ్చింది. గతంలో రోజుకు 170 మిలియన్ యూనిట్లు అవసరం కాగా.. ఇప్పుడు 190 మిలియన్ యూనిట్లకు వినియోగం పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయాలంటే థర్మల్ విద్యుత్ మినహా ప్రభుత్వానికి వేరే గత్యంతరం లేకుండా పోయింది. థర్మల్ విద్యుత్‌కు సంబంధించి ఇప్పటికే రాయలసీమ, కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్లు మూతపడ్డాయి. ఉత్పాదన ఖర్చు అధికంగా ఉందన్న కారణంతో ఈ రెండు ప్లాంట్లను మూసివేశారు.

చంద్ర‌బాబు ఏమ‌న్నారు?

కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనడానికి కృత్రిమంగా విద్యుత్ కొరత సృష్టించారని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏపీ స‌ర్కారుకు విరుచుకుప‌డ్డారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటి కంటే ఏపీలోనే విద్యుత్ చార్జీలు అధికంగా పెంచారని ఆయన తెలిపారు. డిస్కంలకు ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు బకాయి ఉన్న రూ.22 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయిస్తే బహిరంగ మార్కెట్ లో రూ.15 నుంచి రూ.20 పెట్టి కొనాల్సిన అవసరం రాదని సలహా ఇచ్చారు. పొరుగు రాష్ట్రం తెలంగాణకు లేని విద్యుత్‌ సమస్య ఏపీకి ఎందుకు వచ్చిందని ప్రశ్నించిన చంద్రబాబు.. రాష్ట్రంలో ఆరు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మొత్తం రూ.36 వేల కోట్ల భారం మోపారని దుయ్య‌బ‌ట్టారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎలాంటి విద్యుత్ చార్జీలు పెంచలేదని, పవన విద్యుత్, సోలార్ విద్యుత్ తీసుకొచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు.

మీరే చేసి.. మ‌సిపూస్తారా?

రాష్ట్రంలో పేద‌ల‌కు ఇళ్ల పంపిణీ విష‌యంలో ఇటీవ‌ల హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. సెంటు స్థలం ఇచ్చి.. పేద‌ల‌కు ఇళ్లు క‌ట్టిస్తున్నార‌ని.. .. రాష్ట్రాన్ని మురికికూపంగా మారుస్తున్నారంటూ.. వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ఈ ఇళ్ల నిర్మాణాల‌ను నిలుపుద‌ల చేయాల‌ని ఆదేశించింది. దీనిపై వెంట‌నే స్పందించిన వైసీపీ నాయ‌కులు ఇదంతా చంద్ర‌బాబు ఆయ‌న పార్టీ నేత‌ల కుట్ర‌గా పేర్కొన్నారు. తాజాగా దీనిపై స్పందించిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ధ్వ‌జ‌మెత్తారు. ఇళ్ల స్థ‌లాల‌ విషయంలో వైసీపీ నేతలతోనే కోర్టులో పిటిషన్ వేయించి టీడీపీపై బురద జల్లుతున్నారని అన్నారు.

దోచేశారు!

అంతేకాదు.. గృహ నిర్మాణ పునాది పైన కేంద్రం రూ.3,700 కోట్లు విడుదల చేసిందని చంద్రబాబు చెప్పారు. దీనిలో రూ.2 వేల కోట్లను దారి మళ్లించారని, వైసీపీనే కోర్టులో కేసులు వేయించి దాన్ని ప్రతిపక్షాలకు అంటకట్టి దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జగన్ రెడ్డి కట్టే ఇళ్లు శోభనానికి కూడా పనికిరావని వైసీపీ శాసనసభ్యులే చెప్పారని అన్నారు. సెంటు పట్టాలో రూ.6,500 కోట్ల అవినీతి చేశారని, నగరాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్ల భూమి ఇవ్వాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు.

ఆలీషాకు కితాబా?

డ్ర‌గ్స్ కేసులో ఆలీషా పెద్ద మనిషి అని వైసీపీ నాయ‌కుడు చంద్రశేఖర్ రెడ్డి కితాబు ఇవ్వ‌డంపై చంద్ర‌బాబు ఫైర‌య్యారు. అక్రమ వ్యాపారానికి ఇది నిదర్శనం కాదా? అంటూ చంద్రబాబు.. జగన్ సర్కారుపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. రాష్ట్రంలో డ్ర‌గ్స్ మాఫియాకు ప్ర‌భుత్వ‌మే వెన్నుద‌న్నుగా ఉంద‌ని .. చంద్ర‌బాబు అన్నారు. ఆశి ట్రేడింగ్ కంపెనీతో వేలకోట్ల రూపాయల డ్రగ్స్ మాఫియాకు శ్రీకారం చుట్టారని విరుచుకుప‌డ్డారు. ఆశి అనే పేరు ఆలీషా కుమార్తె యొక్క నిక్ నేమ్ కాదా? అని ప్ర‌శ్నించారు. మొత్తానికి గ‌తానికి భిన్నంగా చంద్ర‌బాబు విరుచుకుప‌డ‌డం.. ఇప్పుడు వైసీపీని, ప్ర‌భుత్వాన్ని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.