తెలంగాణలో చాలా నామమాత్రంగా ఉంది జనసేన పార్టీ. గత ఏడాది జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పోటీకి సై అన్నట్లే అని వెనక్కి తగ్గడం ఇక్కడి నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర నైరాశ్యానికి దారి తీసింది. ఆ సందర్భంగా జనసేనాని మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పార్టీ నుంచి కూడా ఈ విషయంలో నిరసన గళాలు వినిపించాయి. ఆ తర్వాత తెలంగాణలో జనసేన కార్యకలాపాలపై పెద్దగా చర్చే లేదు. మొదట్నుంచి ఏపీ రాజకీయాల మీదే ఫోకస్ చేస్తున్న పవన్.. తెలంగాణ రాజకీయాలపై ఎప్పుడూ పెద్దగా దృష్టిసారించింది లేదు.
ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మీద వ్యతిరేక గళం వినిపించే సాహసం పవన్ చేయలేడని.. ఇక్కడ పార్టీ ఎప్పటికీ నామమాత్రమే అని.. ఇక్కడ పెద్దగా కార్యకలాపాలు కూడా ఉండవని ఒక అంచనాకు వచ్చేశారు అందరూ. ఇలాంటి సమయంలో తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలతో కీలక సమావేశానికి పవన్ సన్నద్ధం కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారుతున్న సమయంలోనే జనసేసాని ఈ నెల 9న పార్టీ తెలంగాణ శాఖ క్రియాశీలక కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడానికి ముహూర్తం నిర్ణయించాడు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు ముఖ్య నేతలు పాల్గొనే ఈ సమావేశాన్ని హైదరాబాద్‌లోని జేపీఎల్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో కార్యకర్తలనుద్దేశించి పవన్ ప్రసంగించనున్నాడు.
తెలంగాణలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడం, సంస్థాగత నిర్మాణం, ప్రజల పక్షాన నిలిచి పోరాట కార్యక్రమాలు చేపట్టడంపై నాయకులు, కార్యకర్తలకు జనసేనాని దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ నిర్మాణంలో భాగంగా తెలంగాణలో క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తూ కమిటీల నియామకానికి కసరత్తు జరుగుతున్న సమయంలోనే జనసేనాని ఈ సమావేశం ఏర్పాటు చేశడు. నెలలో కొన్ని రోజుల పాటు తెలంగాణలో పార్టీ కార్యకలాపాలకు సమయం కేటాయిస్తానని పవన్ చెప్పడం గమనార్హం. తెలంగాణలో జనసేనకు పెద్దగా బలం లేకపోయినప్పటికీ.. అధికార టీఆర్ఎస్ బలం తగ్గుతోందన్న అంచనాల నేపథ్యంలో ఇక్కడ తమ వంతు ప్రభావం చూపించడానికి ఉన్న అవకాశాన్ని వాడుకోవాలని జనసేనాని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే క్రియాశీలక కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates