ఏపీలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న వార్తలు అధికార వైసీపీ ఎమ్మెల్యేల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. మంత్రి పదవి రేసులో ఉన్న ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఎవరికి వారు తమ తమ రూట్లలో ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి మొత్తం 100 శాతం మంత్రి వర్గాన్ని మార్చేస్తారని.. తాను కూడా మంత్రి వర్గంలో ఉండనని చెప్పారు. దీంతో చాలా మంది నేతల్లో కొత్త ఆశలు కలుగుతున్నాయి.
ఇక పలువురు నేతలు ఇప్పుడిప్పుడే మనసులో మంత్రి పదవిపై ఉన్న మక్కువతో ఓపెన్ అవుతున్నారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అయితే తాను మంత్రి పదవి రేసులో ఉంటే కావాలనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పార్టీ సీనియర్ నేత, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ ప్రక్షాళన గురించి ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ గతంలోనే తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని చెప్పారు.
అయితే బీసీ జిల్లా కావడంతో మంత్రి పదవి తనకు రాలేదని.. జగన్ మరో 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇక త్వరలోనే మంత్రి వర్గ ప్రక్షాళన నేపథ్యంలో సీఎం జగన్‌ను కలవాలని తన అనుచరులు ఒత్తిడి చేస్తున్నారని.. అయితే మంత్రి వర్గ విస్తరణ జరిగే వరకు తాను ఎవ్వరిని కలవనని కూడా కోలగట్ల చెప్పారు. ఇక తన వయస్సు రీత్యా జగన్ మరోసారి టిక్కెట్ ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు.
ఇక వైశ్య వర్గం కోటాలో ప్రస్తుతం వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నారు. ప్రక్షాళనలో ఆయన్ను తప్పిస్తారనే అంటున్నారు. వెల్లంపల్లిని తప్పిస్తే వైశ్య కోటాలో కోలగట్లతో పాటు ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates