జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తన మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ సినిమా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినీ పరిశ్రమపై వైసీపీ సర్కారు కక్ష కట్టిందని ఏపీ సీఎం జగన్‌పై పవన్ తీవ్ర విమర్శలు చేయడంతో మొదలైన ఈ వివాదం.. చిలికి చిలికి గాలివానలా మారుతోంది. పవన్ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన వైసీపీ మంత్రులు ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని పవన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. చిత్ర పరిశ్రమ వివాదంపై సంచనల వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ప్రయోజనం కోసం నిర్ణయాలు తీసుకోమని తేల్చి చెప్పారు. పవన్ కల్యాణ్ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరని నాని స్పష్టం చేశారు. నలుగురు ప్రొడ్యూసర్లనో.. నలుగురు హీరోలనో దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదని అందరి కోసం జగన్ ఆలోచిస్తున్నారని నాని పేర్కొన్నారు. ఇష్టారాజ్యంగా టికెట్ల ధరలు పెంచుతామంటే తాము ఒప్పుకోమని అందుకు సమర్థించమని కచ్చితంగా అందరికీ మేలు జరిగే నిర్ణయాలు మాత్రమే తీసుకుంటామని వివరించారు.
తెలుగు సినిమా షూటింగ్‌లు జరగాలని తాము కోరుకుంటున్నామని నాని తెలిపారు. కొంతమందికే లాభాలు తెచ్చిపెట్టాలనే ఉద్దేశంతోనే అడ్డగోలుగా టికెట్ల రేట్లు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు ఆడాలనేది తమ అభిమతమని నాని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ఆ.. హూ అంటే అదిరి బెదిరి పోయే వాళ్లం కాదని ఆయన ధ్వజమెత్తారు. సినిమా టికెట్ల ధరల నియంత్రణ కోసం వైసీపీ ప్రభుత్వమే ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించి టికెట్లు విక్రయిస్తుందని జగన్ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ నిర్ణయంపై చిత్ర పరిశ్రమ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్‌పై పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే.
మరోవైపు ఈ వివాదానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలు తాజాగా ఏపీ మంత్రి పేర్ని నానితో సమావేశమయ్యారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌ను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో టికెట్ల విక్రయంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు అవుతుందా? లేదా ఏమైనా మార్పులు చేస్తారా? అన్నది వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates