ఏపీలో కొద్ది రోజులుగా జనసేన, వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో ‘శ్రమదానం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే, ఆ కార్యక్రమానికి, బహిరంగ సభకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
పవన్ కల్యాణ్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టింది మొదలు…సభా ప్రాంగాణానికి వెళ్లి ప్రసంగించేంత వరకూ అడగడుగునా టెన్షన్ క్రియేట్ అయింది. తనను పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదని, నిలబడటానికి ఎన్ని దెబ్బలు తిన్నానో జనానికి తెలియదని పవన్ ఆవేశపూరితంగా అన్నారు. ఎన్నో ఒడిదుడుకులు, ఓటములు అధిగమించి నిలబడేందుకు వచ్చానని, కులాల పేరిట రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
టీవీల్లో తనను తిడితే భయపడేవాడిని కాదని, తన సహనాన్ని పరీక్షించొద్దని వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్ ఇచ్చారు. గుంతలు లేని రోడ్డు ఒక్కటైనా రాష్ట్రంలో ఉందా?అని పవన్ ప్రశ్నించారు. తాను యాక్షన్, కట్ అంటే వెళ్లిపోయేవాడిని కాదని, కనీసం 2 దశాబ్దాలు తనతో ప్రయాణం చేయగలిగేవారే జనసేనలోకి రావాలని అన్నారు. తూ.గో జిల్లాలోకి అడుగుపెట్టలేనని తనపై బెట్టింగులు కట్టారి, నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దని వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
ఇవి మెతక లీడర్లున్న రోజులు కావని, రాష్ట్ర రాజకీయాలు రెండిళ్ల మధ్య జరిగితే కుదరదని పవన్ అన్నారు. ఒక కులాన్ని వర్గ శత్రువుగా చేసుకుని వైసీపీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని పవన్ ధ్వజమెత్తారు. అలా ఉండబట్టే ఏపీలో రోడ్లు లేవని, జీతాలు, పెన్షన్లు రావడం లేదని విమర్శించారు. తాను బైబిల్ చేత్తో పట్టుకుని తిరిగేవాడిని కాదని, గుండెల్లో పెట్టుకుంటానని తెలిపారు.
కాపు, ఒంటరి, తెలగ, బలిజలు ముందుకు వస్తే తప్ప రాష్ట్ర రాజకీయాల్లో మార్పురాదని స్పష్టం చేశారు. నాలుగు కులాలు పెద్దన్నపాత్ర పోషిస్తే తప్ప మిగిలిన కులాలకు సాధికారిత రాదని పవన్ అన్నారు. మరోవైపు, పుట్టపర్తిలో పవన్ విమానం ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించారు. దీంతో, రాజమండ్రి నుంచి బెంగళూరుకు వెళ్లిన పవన్…అక్కడ నుంచి రోడ్డుమార్గంలో అనంతపురం జిల్లా కొత్తచెరువుకు వెళ్లి శ్రమదానం చేయనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates