రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు.. అధికారంలో ఉన్న పార్టీ తలుచుకుంటూ ప్రత్యర్థుల పని పట్టడం ఎంత సేపు! డబ్బు అధికారం హోదా ఇలా ఏదో ఒక ఆశ చూపించి ప్రత్యర్థి చుట్టూ ఉన్న వాళ్లను తమ వైపునకు తిప్పుకుని ప్రత్యర్థిని ఒంటరి చేయాలనే ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇప్పుడీ విషయం ఎందుకు అంటారా? హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం కోసం ప్రాణం పెట్టి ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు అధికార టీఆర్ఎస్ ఇలాంటి షాక్లే ఇస్తోంది. ఆయన చుట్టూ ఉన్న కీలక నాయకులను తమ పార్టీలోకి లాక్కుంటూ ఈటలను ఒంటరి వాణ్ని చేయాలనే ప్రణాళికను అమలు చేస్తున్నారనే విషయం అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు.
వరుసగా రెండు ఎన్నికల్లోనూ విజయం సాధించి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కేసీఆర్.. తనకు ఎదురు నిలిచే నాయకులను ఏ మాత్రం ఉపేక్షించరనే అభిప్రాయాలున్నాయి. తమ పార్టీలోనే ఉంటూ కేసీఆర్‌కు ఈటల ఎదురు తిరగడంతోనే భూకబ్జా ఆరోపణలను బయటకు తీసి ఈటలను పార్టీ వీడి వెళ్లేలా చేశారనే ప్రచారం ఉంది. కారును వీడి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల కమలం గూటికి చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం కోసం శ్రమిస్తున్నారు. ఈ ఎన్నికలో గెలిచి ఈటలకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలని మరోవైపు కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నారు. ఆయన మేనళ్లుడు హరీష్ రావు ఆ నియోజకవర్గంలోనే ఉంటూ వాటిని సమర్థంగా అమలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న హరీష్ రావు సూచనలతోనే ఆ పార్టీ నేతలు ఈటల అనుచరులపై కన్నేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈటలను అన్ని వైపుల నుంచి ముట్టడి చేసేలా ఆయన సొంత మండలంపైనే హరీష్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈటలకు సన్నిహితంగా ఉంటూ ఆయనతో పాటు టీఆర్ఎస్ను వీడిన నేతలను బుజ్జగించో మభ్యపెట్టో తిరిగి పార్టీలోకి లాగేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ఈటల సొంత మండలం కమలాపురం ఎంపీపీ తడక రాణి బీజేపీని వీడి మంత్రి కొప్పులు ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ జడ్పీటీసీ సభ్యుడు కుమారస్వామి కారెక్కడంతో ఈటలకు మరో షాక్ తగిలింది.
గతంలో రాజేందర్‌కు అత్యంత సన్నిహితులుగా ఉన్న పింగళి రమేష్ దేశిని కోటి రంజిత్‌లు బీజేపీని వీడి తిరిగి టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడేమో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కమలాపురం మండల నేతలు దూరమవడం ఈటలకు మింగుడు పడడం లేదు. ఇదిలా ఉంటే.. మరోవైపు ఇలాంటి జంపింగ్‌లో ఉంటాయని తాము ముందే ఊహించామని ప్రజలే ఈటలను గెలిపిస్తారని ఆయన వర్గం దీమాతో ఉంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే నవంబర్ 2 వరకూ ఆగక తప్పదు. మరి ఎన్నికల లోపు ఇంకెంత మంది ఈటలను వీడిపోతారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates