జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వరుసగా వైసీపీ మంత్రులు, ఆ పార్టీ కీలక నేతలు విరుచుకు పడుతూనే ఉన్నారు. పవన్ రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో ఏపీ ప్రభుత్వాన్ని, జగన్‌ను టార్గెట్ చేసిన మరుక్షణం నుంచే వైసీపీ వాళ్లు తీవ్రస్థాయిలో పవన్‌పై ఎటాక్ చేస్తున్నారు. పోసాని కృష్ణమురళీ విమర్శలతో అది తారాస్థాయి వెళ్లింది. ఇప్పటికే పవన్‌ను మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని పవన్‌పై భారీగా విరుచుకుపడ్డారు. ఇక ఇప్పుడు బొత్స, ఆదిమూలపు సురేష్ వంతు వచ్చింది.
వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ పవన్‌పై సెటైర్లు వేశారు. పవన్ జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలను ఆయన ఖండించారు. పవన్ గత 15 సంవత్సరాల నుంచి చొక్కాలు చింపుతానని అంటున్నారని.. ఇప్పటి వరకు ఎన్ని చొక్కాలు చింపారో చెప్పాలన్నారు. పవన్‌కు ఏం తెలుసు గోంగూరు కట్ట అని తీసిపారేశారు. 2009 నుంచి కూడా పవన్ నోటి వెంట ఈ డైలాగులు వింటూనే ఉన్నామని బొత్స ఎద్దేవా చేశారు.
ఇక మరో మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా పవన్‌పై విరుచుకు పడ్డారు. ఆన్లైన్ టిక్కెటింగ్ సినీ ఇండస్ట్రీకే లాభమని సినిమా పరిశ్రమ పెద్దలే చెపుతున్నారని.. అలాంటిది ఈ సిస్టమ్‌పై పవన్ ఎందుకు కెలుక్కుంటున్నారని ఆయన ప్రశ్నించారు. దీనిపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వాళ్లకే నచ్చలేదని.. ఇండస్ట్రీ అంతా ఒకే తాటిపై ఒకే మాట మీద ఉంటే పవన్ మధ్యలో కావాలనే దీనిని రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
పవన్ కేవలం సినిమా ఇండస్ట్రీకే కాకుండా.. రాష్ట్రానికే గుదిబండలా మారారని ఆయన విమర్శించారు. పవన్ వ్యవహారం చాలా ప్రమాదకరంగా ఉందని.. ఆయన కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తుండడం దారుణమని సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ఎవరి కోసం పోరాటం చేస్తున్నారో ? పవన్ ఎజెండా ఏంటో ఆయనకే తెలియాలన్నారు. పవన్ తీరును రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని కూడా సురేష్ అన్నారు.