పవన్ స్పీచ్‌పై వైసీపీ నుంచి ఫస్ట్ రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న జగన్ సర్కారును మునుపెన్నడూ లేని స్థాయిలో టార్గెట్ చేస్తూ ‘రిపబ్లిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ ప్రకంపనలు రేపుతోంది. నిన్న రాత్రి నుంచి ఎక్కడ చూసినా ఈ ప్రసంగం గురించే చర్చంతా. ఒకప్పటి ఆవేశాన్ని అణుచుకుని కొన్నేళ్లుగా రాజకీయ ప్రత్యర్థుల పట్ల చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నాడు పవన్. అవతలి వాళ్లు కవ్వించినా కూడా నోరు జారట్లేదు. విమర్శలు సుతిమెత్తగానే చేస్తున్నాడు.

ఇది జనసైనికులకు అంతగా రుచించట్లేదు. వైసీపీ వాళ్లకు వాళ్ల భాషలోనే సమాధానం చెప్పాలని, దూకుడుగా వ్యవహరించాలని వాళ్లు కోరుకుంటున్నారు. పవన్ సరిగ్గా అదే పని చేశాడు ‘రిపబ్లిక్’ ఈవెంట్లో. ముఖ్యంగా వైసీపీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి.. సన్నాసి సన్నాసి అని పదే పదే సంబోధించడం హాట్ టాపిక్ అయింది. ఈ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.

ఐతే పేర్ని నాని, ఇతర వైసీపీ నాయకులు పవన్ వ్యాఖ్యల పట్ల ఎలా స్పందిస్తారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. మామూలుగానే ప్రత్యర్థుల్ని తీవ్ర పదజాలంతో దూషించే ఆ పార్టీ నాయకులు.. పవన్ ఇంత మాట అన్నాక ఊరుకుంటారా అని చూస్తున్నారంతా. కాగా ఆ పార్టీ నుంచి ముందుగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బయటికొచ్చారు. పవన్ మీద విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద సన్నాసి పవన్ కళ్యాణే అని ఆయన విమర్శించారు. చిరంజీవి లేకుండా పవన్ ఒక జీరో అని కూడా వెల్లంపల్లి అన్నారు. ఇక పవన్ నటన గురించి మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్‌ యాక్టింగ్‌లో 25 శాతం కూడా నటించలేడంటూ ఎద్దేవా చేశారు వెల్లంపల్లి.

ఐతే మంత్రి వ్యాఖ్యలపై జనసైనికులు సోషల్ మీడియాలో గట్టిగానే ఎదురు దాడి చేస్తున్నారు. ఒకప్పుడు పవనిజం టీషర్టులను పవర్ స్టార్ అభిమానులతో కలిసి లాంచ్ చేసిన ఫొటోలు.. అలాగే తనకు మద్దతుగా ఒక మాట మాట్లాడితే జనాలు ఓట్లేస్తారంటూ పవన్‌ను బతిమాలుకుని ఆయనతో వీడియో బైట్ ఇప్పించుకున్న వీడియో షేర్ చేసి ఆయన తీరును దుయ్యబడుతున్నారు పవన్ ఫ్యాన్స్.