విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుపెట్టుకుని జనసేన చేస్తున్న హడావుడి వెనక పెద్ద వ్యూహమే ఉన్నట్లుంది. ఇపుడు కాకపోయినా కొద్దిరోజుల తర్వాతైనా పాలనా రాజధానిగా విశాఖకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవటం ఖాయమని జనసేన అధినేత పవన్ కల్యాన్ గ్రహించినట్లున్నారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో ఈ జిల్లా నుండే మళ్ళీ పోటీ చేయాలని డిసైడ్ అయ్యారట.
పవన్ దృష్టిలో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన గాజువాక తో పాటు భీమిలీ నియోజకవర్గం కూడా ఉందని సమాచారం. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి తిప్పలనాగిరెడ్డి చేతిలో పవన్ సుమారు 18 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికలైపోయిన దగ్గర నుండి మళ్ళీ పవన్ నియోజకవర్గం మొహమే చూడలేదు. అలాంటిది హఠాత్తుగా జనసేన తరపున వైజాగ్ లో హడావుడి పెరిగిపోయింది.
అధినేత పవన్ తరపున నాదెండ్ల మనోహర్ వైజాగ్ లో క్యాంపు వేసి మరీ హడావుడి మొదలుపెట్టారు. వైజాగ్ లో కార్యక్రమాలు ఎలా మొదలుపెట్టాలా అని చూస్తున్న జనసేన నేతలకు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అచ్చివచ్చింది. దాంతో స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులతో నాదెండ్ల వరుసబెట్టి సమావేశాలు నిర్వహించేస్తున్నారు. కార్మిక, ఉద్యోగసంఘాలకు జనసేన తరపున పవన్ భరోసా ఎప్పుడూ ఉంటుందని నాదెండ్ల హామీఇచ్చేశారు.
పవన్ తొందరలోనే వైజాగ్ వస్తారని, కార్మికులు, ఉద్యోగుల తరపున ప్రత్యేకంగా కార్యాచరణ మొదలుపెడతారంటు ప్రకటించేశారు. నాదెండ్ల ప్రకటనలు, భేటీలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో పవన్ మళ్ళీ ఇదే జిల్లానుండి పోటీ చేయాలని డిసైడ్ అయినట్లే అనుమానంగా ఉంది. పోయిన చోటే వెతుక్కోవాలన్న పద్దతిలో మళ్ళీ గాజువాక నుండే పోటీచేసే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయట. ఒకవేళ చివరి నిముషంలో నియోజకవర్గాన్ని మార్చుకోవాల్సొస్తే భీమిలీలో పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు.
భీమిలీలో ప్రస్తుతం వైసీపీ తరపున మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఈయన టీడీపీ అభ్యర్ధి సబ్బంహరిని సుమారు 30 వేల ఓట్ల తేడాతో ఓడించారు. అయితే హఠాత్తుగా సబ్బం మరణించటంతో ఇక్కడ టీడీపీకి గట్టి అభ్యర్ధి కరువయ్యారు. ఒకవేళ టీడీపీతో పొత్తుంటే చాలా ఈజీగా భీమిలీలో తాను గెలవచ్చని పవన్ అనుకుంటున్నట్లు సమాచారం. చూద్దాం చివరకు ఏమవుతుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates