రాష్ట్రంలో మొత్తం మంత్రి వర్గం మారిపోతుందా? ముఖ్యమంత్రి జగన్ అందరినీ పక్కన పెట్టేస్తారా? అంటే.. ఔననే అంటున్నారు సీనియర్ నాయకులు, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. మంత్రి వర్గ మార్పుపై తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈయన చెప్పిన విషయాన్ని ఆషామాషీగా తీసిపారేసేందుకు అవకాశం లేదు. ఎందుకంటే.. జగన్కు బంధువు, మంత్రివర్గంలో కీలక నాయకుడు కాబట్టి.
సో.. విషయంలోకి వెళ్తే.. ఏపీ సీఎం జగన్.. తన మంత్రి వర్గ మార్పుపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వాస్తవానికి 2019లో ప్రబుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలో ముఖ్యమంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసేటప్పుడే.. తన మంత్రివర్గాన్ని రెండున్నరేళ్లో 90 శాతం మారుస్తానని చెప్పారు.
అయితే.. దీనిపై ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే.. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితిలో నెట్టుకు రావాలంటే.. పాత మంత్రులు ఉండాల్సిందేనని అందరూ భావిస్తున్నారు. పైగా మంత్రులకు జగన్ పెట్టిన స్థానిక ఎన్నికల టార్గెట్ను కూడా వారు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో మంత్రి వర్గంలో పెద్దగా మార్పులు ఉండవని అనుకున్నారు. ఒకవేళ ఉన్నా.. సీనియర్లు.. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్.. ధర్మాన కృష్ణదాస్.. బొత్స సత్యనారాయణ వంటివారు ఖచ్చితంగా ఉంటారని అనుకున్నారు. అయితే.. ఎవరి పట్ల జగన్ పక్షపాతం చూపించే పరిస్థితి లేదని తాజాగా బాలినేని వ్యాఖ్యలతో స్పష్టమైంది.
రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులపై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారీ మార్పులుంటాయని చెప్పారు. మంత్రివర్గంలో వంద శాతం కొత్తవారినే తీసుకుంటామని సీఎం చెప్పారని వెల్లడించారు. తనను కూడా తీసేస్తానని చెప్పినట్టు తెలిపారు. అయితే.. తాను విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎంకు చెప్పినట్లు మంత్రి తెలిపారు. మంత్రివర్గాన్ని వంద శాతం మారుస్తానని సీఎం గతంలోనే చెప్పారన్నారు.
మంత్రివర్గాన్ని వంద శాతం మారిస్తే మంచిదే అని సీఎంకు చెప్పానన్న ఆయన.. తనను కూడా మార్చాలని చెప్పానని తెలిపారు. మంత్రి పదవి పోయినా తాను భయపడనని స్పష్టం చేశారు. తనకు పార్టీయే ముఖ్యమని.. పదవులు కాదని వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇప్పటికి జగన్ మంత్రి వర్గంపై ఫుల్లు క్లారిటీ వచ్చిందని అంటున్నారు పరిశీలకులు.