జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మహళలకు టాప్ ప్రయారిటి దక్కుతోంది. పదువులు ఏవైనా కానీండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకే అగ్రస్ధానం ఇవ్వాలని జగన్ ఓ ఫార్ములా పెట్టుకున్నారు. పై వర్గాల్లో కూడా అవకాశం ఉన్నంతలో మహిళలకే పట్టం కట్టాలనేది జగన్ నిర్ణయం. ఇందులో భాగంగానే తాజాగా వెల్లడైన పరిషత్ ఫలితాల ప్రకారం జడ్పీ ఛైర్మన్లు, మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ పదవుల్లో కూడా మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం 13 జడ్పీ ఛైర్మన్లలో ఏడింటిని, 660 మండల పరిషత్ ప్రెసిడెంట్ పదవుల్లో సుమారు 340 పదవులను మహిళలకే జగన్ కేటాయించారు. మళ్ళీ వీరిలో కూడా పైన చెప్పుకున్నట్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి వర్గాలకే అధిక ప్రాధాన్యం. ఇవికాకుండా మైనారిటిలకు 686 కో ఆప్టెడ్ పదవులను భర్తీ చేయబోతున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్ ఓ వ్యూహం ప్రకారం మహిళలకు అగ్రాసనం వేస్తున్నారు. ఈ మధ్యనే భర్తీ చేసిన మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేషన్లలో మేయర్ పోస్టుల్లో కూడా మహిళలకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చింది అందరు చూసిందే.
జనరల్ క్యాటగిరిల్లో కూడా జగన్ రిజర్వుడు మహిళలను కీలకపోస్టులకు ఎంపిక చేయటం గమనార్హం. మామూలుగా జనరల్ క్యాటగిరి పోస్టుల్లో అగ్రవర్ణాలను మాత్రమే ఎంపికచేస్తారు. కానీ జగన్ దానికి భిన్నంగా రివర్సులో వ్యవహరించారు. మొత్తానికి మహిళలకు జగన్ ఇస్తున్న ప్రాధాన్యత ఓ వ్యూహం ప్రకారమే జరుగుతున్నదని అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనేది కూడా ఎక్కువగా మహిళలే అనేది ఓ సర్వే నివేదిక.
అందుకనే తమ ప్రభుత్వంలో ఎక్కువగా మహిళలకు ప్రయారిటి ఇస్తే రేపటి ఎన్నికల్లో వాళ్ళే తమను ఆదుకుంటారనేది జగన్ ఆలోచన. నిజానికి 56 కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా అట్టడుగు వర్గాలకు అందులోను మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన విషయం గొప్పనే చెప్పాలి. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది లేదు, మహిళలకు పెద్దపీట వేసిందీలేదు. అయితే రాజకీయాల్లో ఎప్పుడూ 1+1= 2 అనేందుకు లేదు.
1+1=2 అనేది లెక్కలో కరెక్టే అయినా రాజకీయాలకు వచ్చేసరికి సున్నా కూడా అయిపోతుంది. ఎలాగంటే తాము అందలాలు ఎక్కించిన వారు, తమ ద్వారా పదవులు అందుకున్నవారంతా తిరిగి తమకే ఓట్లు వేస్తారని లేదా వేయిస్తారని అనుకునేందుకు లేదు. సంక్షేమ పథకాల్లో లబ్దిదారులంతా అధికారపార్టీకే ఓట్లు వేస్తున్నారని అనుకుంటే ఉత్త భ్రమ మాత్రమే. ఓట్లు వేయటానికి వేయకపోవటానికి ఎవరికి వాళ్ళకు చాలా కారణాలు ఉండచ్చు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో లబ్దిదారులు, పదవులు అందుకున్న వాళ్ళు ఏమి చేస్తారో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates