కాంగ్రెస్ వ్యూహం బాగానే ఉంది, కానీ…

పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్ జీత్ సింగ్ చన్నీ బాధ్యతలు తీసుకున్నారు. పంజాబ్ లో ముఖ్యమంత్రిగా నియమితులైన మొదటి దళిత నేత చన్నీయేనట. అంటే ఇప్పటివరకు అగ్రవర్ణాల్లోని వారే రాష్ట్రాధిపతులుగా ఏలినట్లు స్పష్టమవుతోంది. ఎన్నికలు మరో ఆరుమాసాల్లో ఉండగా హై కమాండ్ అమరీందర్ ను తప్పించటం తప్పా ? ఒప్పా అన్నది వేరే విషయం. బలమైన నేతగా గుర్తింపున్న అమరీందర్ ను తప్పించటం వెనుక హై కమాండ్ కు పెద్ద వ్యూహమే ఉన్నట్లు అర్ధమవుతోంది.

ఇంతకీ ఆ వ్యూహం ఏమిటంటే దళితుల ఓట్లను ఆకట్టుకోవటమే అసలైన ప్లాన్ గా తెలుస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే సీఎంగా దళిత నేతనే ఎంపిక చేస్తామని శిరోమణి అకాలీదళ్ ఇప్పటికే ప్రకటించింది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావటమే టార్గెట్ గా అకాలీదళ్-బీఎస్పీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. ఇందులో భాగంగానే ముందుగానే బీఎస్పీతో చేతులు కలిపింది.

ఇక బీజేపీ వ్యవహారం తీసుకుంటే తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎస్సీ నేతే ఉంటారని పార్టీ ప్రకటించేసింది. సీఎం అభ్యర్ధి ఎవరనే విషయాన్ని ప్రకటించకపోయినా ఎస్సీ నేతకే సీఎం పదవి అనిమాత్రం స్పష్టంగా ప్రకటించేసింది. దీంతో ఒక ప్రధాన కూటమి, మరో ప్రధాన పార్టీల తరపున ఎస్సీ నేతలే సీఎంలవుతారనే ప్రచారం పెరిగిపోతోంది. దాంతో కాంగ్రెస్ కూడా ఆలోచనలో పడి హఠాత్తుగా అమరీందర్ ను తప్పించేసింది.

అధికారంలోకి వస్తే సీఎంగా ఎస్సీ నేతను కూర్చోబెడతామనే ఇతర పార్టీల ప్రకటనను కాంగ్రెస్ ఇపుడే అమల్లోకి తేవాలని డిసైడ్ అయిపోయింది. ఇందులో భాగంగానే చరణ్ జిత్ ను సీఎంగా కూర్చోబెట్టేసింది. కొత్త సీఎం మూడోసారి ఎంఎల్ఏగా గెలిచి మొన్నటి వరకు అమరీందర్ క్యాబినెట్లో మంత్రిగానే ఉన్నారు. కొత్త సీఎం కూడా ఎస్సీల్లో గట్టిపట్టు ఉన్న నేతేనట. పంజాబ్ లో 32 శాతం ఎస్సీలున్నారు. రాబోయే ఎన్నికల్లో దళిత ఓటుబ్యాంకును కొల్లగొట్టడమే టార్గెట్ గా కాంగ్రెస్ అధిష్టానం పావులు కదిపేసింది.

హఠాత్తుగా కాంగ్రెస్ అధిష్టానం చేసిన పనితో మిగిలిన ప్రతిపక్షాలకు షాక్ కొట్టినట్లే అయ్యింది. భవిష్యత్తులో తమ హామీని కాంగ్రెస్ ఇపుడే అమల్లోకి తెచ్చేస్తుందని ప్రతిపక్షాలు ఏమాత్రం ఊహించలేదు. రాబోయే ఎన్నికలను ఎస్సీ నేతైన చరణ్ జిత్ ఆధ్వర్యంలోనే వెళుతుందన్నది స్పష్టమైపోయింది. ఇప్పటికే అమరీందర్ పాలనలో ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేస్తోంది. వీటిని గనుక కొత్త సీఎం ఇంకా గట్టిగా అమలు చేస్తే బాగానే ఉంటుంది. కాబట్టి మళ్ళీ తమకే అధికారం గ్యారెంటీ అని కాంగ్రెస్ అనుకుంటోంది. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.