ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీ నేతలు ఇప్పుడు మంత్రి పదవిని మాత్రమే కలవరిస్తున్నారు. జగన్ కేబినేట్లో చోటు దక్కించుకోవాలనే ఆశతో ఉన్న ఎమ్మెల్యేలు ఓ వైపు.. ఇప్పటికే ఉన్న మంత్రి పదవిని కాపాడుకోవాలనే తాపత్రాయంలో ఉన్న నేతలు మరోవైపు. ఇలా వైసీపీలో మంత్రి పదవులు చర్చ జోరుగా సాగుతోంది. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని 2019లో జగన్ సీఎం అయినప్పుడే స్పష్టం చేశారు. ఇప్పుడా సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఇప్పటికే కొత్త మంత్రి వర్గ విస్తరణ దిశగా కసరత్తులు చేస్తున్న జగన్.. ఆ దిశగా నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం.
ఈ దసరాకు కాస్త అటూ ఇటూగా మంత్రి వర్గ ప్రక్షాళన చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మంత్రుల పనితీరుపై ఆయన మూణ్నాలుగు నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కనీసం 11 మంది మంత్రులకు ఉద్వాసన తప్పదని వైసీపీ వర్గాల్లోనే జోరుగా ప్రచారం సాగుతోంది. అందులో వెల్లంపల్లి శ్రీనివాసరావు, సుచరిత, తానేటి వనితి, రంగనాధరాజు, శంకరనారాయణ, పుష్ప శ్రీ, జయరాం, నారాయాణ స్వామి, అనిల్ కుమార్, అవంతి శ్రీనివాస్, విశ్వరూప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మంత్రులను తప్పించే క్రమంలో వాళ్ల పనితీరును పరిగణలోకి తీసుకోవడంతో పాటు కొందరి విషయంలో సామాజిక సమీకరణలపైనా జగన్ దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.
ఈ మంత్రుల్లో చాలా మంది పనితీరు మరీ తీసికట్టుగా ఉందని జగన్కు రిపోర్ట్ అందినట్లు తెలుస్తోంది. దీంతో వీళ్లపై వేటు తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది. వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానంలో అన్నా రాంబాబు లేదా కోలగట్లకు ఛాన్స్ ఉండొచ్చనే ఊహాగానాలు వ్యక్తమవతున్నాయి. ఇక జయరామ్, శంకర్ నారాయణ స్థానాల్లోకి బీసీ మంత్రులే వస్తారా? అన్న ఆసక్తి రేకెత్తుతోంది. లేదా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులకు అవకాశం దక్కుతుందేమో చూడాలి. ఇక అనిల్ బదులు పార్థసారథితో పాటు కారుమూరి నాగేశ్వరరావు పేరు కూడా వినిపిస్తోంది. ఇక రంగనాథ రాజు స్థానంలో ప్రసాద రాజుకు ఛాన్స్ ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కాపు మంత్రుల్లో నలుగురిలో ఇద్దరిపై వేటు తప్పదనే విషయం తెలుస్తోంది. పుష్ప శ్రీ బదులు రాజన్న దొర లేదా బాలరాజుకు అవకాశం దక్కే వీలుంది. మరి జగన్ మనసులో ఏముందు తేలాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates