షాక్.. శ్రామిక్ రైళ్లలో 80 మంది చనిపోయారు

షాకింగ్ నిజం బయటకు వచ్చింది. ఇంతకాలం గుట్టుగా ఉంచిన ఈ వ్యవహారం ఇప్పుడు కలకలంగా మారుతోంది. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం అనేక ప్రశ్నలకు.. సందేహాలకు తావిస్తోంది. లాక్ డౌన్ వేళ.. సొంతూళ్లకు వెళ్లేందుకు వందలాది కిలోమీటర్లు కాలి నడకన వలసకార్మికులు వెళుతున్న వైనం తీవ్ర విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చాలా ఆలస్యంగా.. అలాంటి వలసకూలీల్ని వారి స్వస్థలాలకు చేర్చేందుకు వీలుగా కేంద్రం శ్రామిక్ రైళ్ల పేరుతో సర్వీసుల్ని నడపాలని డిసైడ్ చేయటం తెలిసిందే. రెగ్యులర్ ట్రైన్లకు మించిన ఛార్జీలతో పాలు.. సర్ ఛార్జిని సైతం విధిస్తూ నడిపిన ఈ ట్రైన్లు మోడీ సర్కారు ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేశాయి.

ఈ ట్రైన్ల ద్వారా ఇప్పటికే లక్షలాదిమందిని వారి స్వస్థలాలకు చేర్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తొలుత రోజుకు 40 రైళ్లు నడిపేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైతే.. అన్ని ట్రైన్లలో వచ్చే తమ ప్రజల్ని.. వారి సొంతూళ్లకు చేర్చటం కష్టమవుతుందని ఆయా రాష్ట్రాల వారు చేతులు ఎత్తేశారు. దీంతో.. పరిమిత సంఖ్యలో రైళ్లను నడిపింది కేసీఆర్ సర్కారు. చాలా రాష్ట్రాల్లోనూ ఇలాంటి విధానాన్నే అనుసరించారు. అలా రైళ్లలో ప్రయాణించి.. వారి సొంతూళ్లకు క్షేమంగా చేరినట్లుగా ఇంతకాలం భావించారు.

ఇలాంటివేళ.. రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ షాకింగ్ నిజాన్ని చెప్పుకొచ్చారు. శ్రామిక్ రైళ్లలో ప్రయాణించిన వలసకార్మికుల్లో 80 మంది వరకు మరణించినట్లు పేర్కొన్నారు. అందులో ఒకరు కరోనాతో మరణించగా.. మిగిలిన వారు అనారోగ్య సమస్యలతో మరణించినట్లుగా చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆనారోగ్య సమస్యలు ఏమిటంటే.. వివిధ రకాలైన అనారోగ్యాలు అన్న మాట చెబుతున్నారే కానీ.. మిగిలిన వివరాలు వెల్లడించలేదు.

ఈ మరణాలపై మరిన్ని ప్రశ్నలు సంధించిన విలేకరులకు ఆయన సమాధానం చెప్పకుండా.. దాటవేసే ప్రయత్నం చేశారు. మరణాలపైన విచారణ జరుగుతోందని.. దీనికి సంబంధించిన నివేదిక వచ్చాక వెల్లడిస్తామన్న ఆయన మాటలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. ఇంతకీ.. అంత పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకోవటం ఏమిటి? దానికి కారణాలు ఏమై ఉంటాయన్నది ఇప్పుడో మిస్టరీగా మారాయని చెప్పక తప్పదు.