జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుపై.. ఎంపీ ఆర్ఆర్ఆర్ షాకింగ్ నిర్ణ‌యం!

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ దాఖ‌లు చేసిన‌ పిటిష‌న్‌పై మ‌రో 24 గంట‌ల్లో హైద‌రాబాద్‌లోని సీబీఐ ప్ర‌త్యేక కోర్టు.. తీర్పు వెలువ‌రించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ తీర్పు ఎలా ఉంటుంది? జ‌గ‌న్ బెయిల్ ర‌ద్ద‌వుతుందా? లేదా? ఒక‌వేళ ర‌ద్ద‌యితే.. ఏపీలో పాల‌న ప‌రిస్థితి ఏంటి? ఎవ‌రు ముఖ్య‌మంత్రి అవుతారు? జగ‌న్ జైలుకు వెళ్తారా? ఇలా.. అనేక ప్ర‌శ్న‌లు.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే.. ఇంత‌లోనే ఈ బెయిల్ ర‌ద్దు కోరుతూ.. పిటిష‌న్ దాఖ‌లు చేసిన వైసీపీ ఎంపీ.. ర‌ఘురామ కృష్ణ‌రాజు ఉర‌ఫ్ ఆర్ఆర్ఆర్‌.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

వాస్త‌వానికి గ‌త కొన్నాళ్ల కింద‌ట‌.. ఏపీ సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుచేయాల‌ని.. కోరుతూ.. ఆర్ఆర్ఆర్ నాంప‌ల్లి లోని సీబీఐ ప్ర‌త్యేక కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ప్ర‌స్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న జ‌గ‌న్‌.. త‌న కేసుల‌కు సంబంధించి.. సాక్షుల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంద‌ని.. అందుకే ఆయ‌న బెయిల్ ర‌ద్దు చేయాల‌ని ర‌ఘురామ కోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిపై విచార‌ణ‌లో సీబీఐ త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన న్యాయ‌వాదులు.. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుపై కోర్టు విచ‌క్ష‌ణ మేర‌కు నిర్ణ‌యం తీసుకోవాల‌ని అభ్య‌ర్థించారు. దీంతో.. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుపై ఉత్కంఠ ఏర్ప‌డింది.

ఇక‌, దీనిపై మ‌రో 24 గంట‌ల్లో తీర్పు వెలువ‌డుతుంద‌న‌గా.. ఆర్ఆర్ఆర్‌.. తాజాగా తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. సీఎం జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ.. తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. సీబీఐ కోర్టు రేపు ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని రఘురామ కోరటంతో.. ఈ రోజు విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. అయితే.. అనూహ్యంగా ఆర్ఆర్ఆర్ యూట‌ర్న్ తీసుకోవ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.