మావోయిస్టు అగ్రనేతల్లో కలవరం

గతంలో ఎప్పుడూ లేనట్లుగా మావోయిస్టులు లొంగిపోవటంపై అగ్రనేతల్లో కలవరం పెరిగిపోతోంది. ఒకవైపు రిక్రూట్మెంట్ లేకపోవటంతో మావోయిస్టు ఉద్యమం బలహీనమైపోతోంది. ఇదే సమయంలో ఉన్నవారిలో కూడా లొంగిపోవాలనే ఆలోచనలు పెరిగిపోతుండటంతో అగ్రనేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అందుబాటులో ఉన్న సమాచరం ప్రకారం గడచిన రెండేళ్ళల్లో సుమారు 171 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

లొంగిపోయిన వారంతా కీలకమైన నేతలు కాకపోయినా వివిధస్ధాయిలో పనిచేసేవారే కావటం గమనార్హం. మావోయిస్టు అగ్రనేతలను ఇబ్బంది పెడుతున్న విషయం ఏమిటంటే గడచిన రెండేళ్ళుగా లొంగుబాట్లు ఎక్కువైపోవటం. ఇదే సమయంలో ఎన్ కౌంటర్లు కూడా ఎక్కువైపోతోంది. నిర్భంధ లొంగుబాట్లు, ఎన్ కౌంటర్లు, స్వచ్చంధ లొంగుబాట్లకు తోడు అనారోగ్యాలు బాగా పట్టి పీడిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏడాదిన్నర కాలంగా కరోనా వైరస్ సమస్య కూడా మావోయిస్టులను బాగా ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం.

కరోనా వైరస్ కారణంగా కీలక నేతలతో పాటు దిగువస్థాయి క్యాడర్ చాలా ఇబ్బంది పడ్డారు. రాష్ట్ర కార్యదర్శి హరి భూషణ్ మరణించారు. చర్ల-శబరి ఏరియా కమిటి కార్యదర్శి హరిభూషణ్ భార్య శారద కూడా తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. దాంతో ఆవిడ కూడా ఈ రోజో రేపో లొంగిపోతున్నారని సమాచారం. ములుగు జిల్లాకు చెందిన కీలక నేత ఒకరు లొంగిపోయేందుకు ఓ ప్రజాప్రతినిధి ద్వారా పోలీసు అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

దండకారణ్యం, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం ఏరియాల్లో ఉండే మావోయిస్టు దళ సభ్యుల్లో చాలామంది ఇప్పటికే లొంగిపోయారు. ఎక్కడో అడవుల్లో తిరుగుతూ కుటుంబ సభ్యులకు, అయిన వాళ్లకు దూరంగా ఉండటం, తరచూ అనారోగ్యం పాలవ్వటం, ఎప్పుడు ఎన్ కౌంటర్ అయిపోతామే తెలీని భయంతోనే ఎక్కువగా లొంగుబాట్లు ఉంటున్నాయి. పోయిన సంవత్సరంలో 50 మంది లొంగిపోతే ఈ ఏడాది ఇప్పటికే 42 మంది పోలీసుల ముందు లొంగిపోయారు. వీరు కాకుండా సానుభూతిపరులు, కొరియర్లు మరో 52 మంది కూడా లొంగిపోయారు. మొత్తం మీద మావోయిస్టుల్లో అయితే టెన్షన్ పెరిగిపోతోందనేది ఖాయం.