సీఎం అభ్యర్థిగా ప్రియాంక ?

ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ సీఎంగా ప్రకటించబోతున్నారా ? అంటే అవుననే చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ప్రియాంకను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి చాలా ఉపయోగాలు ఉన్నాయని యూపీ నేతలు చాలా మంది భావిస్తున్నారు. వచ్చే ఏడాదిలో జరగబోయే ఎన్నికల వేడి ఇఫ్పటికే మొదలైపోయింది. అందుకనే అన్నీ పార్టీల కీలక నేతలు పదే పదే యూపీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక కూడా యూపిలో రెగ్యులర్ గా పర్యటిస్తున్నారు.

ఇదే విషయాన్ని సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ పార్టీకి యూపీలో పునర్వైభవాన్ని తేవటానికి ప్రియాంక చాలా కష్టపడుతున్నట్లు చెప్పారు. ప్రియాంక నాయకత్వంలోనే తమ పార్టీ ఎన్నికలకు వెళుతుందని కూడా చెబుతున్నారు. పార్టీ కోసం ఇన్ని చేస్తున్న ప్రియాంక ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయని ఖుర్షీద్ ప్రకటించారు. ఈయన ప్రకటన చూసిన తర్వాత మిగిలిన నేతలు కూడా సీఎం అభ్యర్ధిగా ప్రియాంకే ఉండాలని డిమాండ్లు మొదలుపెట్టారు.

మొత్తానికి పార్టీకి పూర్వ వైభవం రావాలంటే అది గాంధీ కుటుంబం వల్లే సాధ్యమవుతుందని పార్టీలోని నేతలంతా భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. పైగా ప్రియాంక కూడా యూపీ విషయంలో చాలా కాలంగా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఎప్పుడు అవకాశం దొరికినా యూపిలోనే పర్యటిస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తొందరలోనే యూపీలో పాదయాత్ర చేసే అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. ఒకవేళ అదే కనుక నిజమైతే గాంధీ కుటుంబానికి సంబంధించి ఒక చరిత్ర అనే చెప్పాలి.

క్షేత్రస్థాయిలో పరిస్ధితులు చూస్తే యూపీలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై పోయి చాలా సంవత్సరాలైపోయింది. భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందనే నమ్మకం కూడా ఎవరిలోనూ లేదు. ఎందుకంటే ఒకవైపు బీజేపీ మరోవైపు ఎస్పీ, ఇంకోవైపు బీఎస్పీ చాలా బలంగా కనబడుతున్నాయి. ఇవి కాకుండా చిన్నా చితక పార్టీలు చాలా ఉన్నాయి. వీటన్నింటినీ తట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కాదు కదా కనీసం గౌరవప్రదమైన సీట్లు సాధించటం కూడా కష్టంగా మారిపోయింది. ఈ నేపధ్యంలోనే అందరి ఆశలు ప్రియాంక మీదే ఉంది. మరి ఆమె ఏమి చేస్తుందో చూడాలి.