ప్రజా వ్యతిరేకత అర్ధమవుతోందా ?

కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ కు జనాల్లో వ్యతిరేకత అర్ధమవుతోందా? అన్న అనుమానం పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే గుజరాత్ సీఎంగా ఉన్న విజయ్ రుపానీ రాజీనామా చేసేయడమే. రూపానితో పాటు యావత్ మంత్రివర్గం తో బీజేపీ అధిష్టానం రాజీనామా చేయించేసింది. ఇక్కడ అధిష్టానం అంటే కేవలం నరేంద్ర మోదీ మాత్రమే అని అందరు అర్థం చేసుకోవాలి. గడచిన ఐదేళ్ళుగా సీఎంగా ఉన్న రూపానీతో ఇంత హఠాత్తుగా ఎందుకు రాజీనామా చేయించినట్లు ?

రూపానీపై చాలాకాలంగా ఆరోపణలు, అసంతృప్తులు ఉన్నాయట. రూపానీతో పాటు ఆయన మంత్రివర్గంలోని చాలామందిపై జనాల్లో అసంతృప్తి బాగా పెరిగిపోతోందట. తొందరలోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. రూపాని పాలనలోని అసంతృప్తితో పాటు కేంద్రంలోని మోదీ పాలనపైన కూడా వ్యతిరేకత పెరిగిపోతోంది. రెండు కలిస్తే రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు తప్పవని మోడీకి అర్ధమైపోయింది. అందుకనే హఠాత్తుగా రూపానీతో రాజీనామా చేయించేశారు. తొందరలోనే కొత్త సీఎం+మంత్రులను ఎంపిక చేస్తారు.

మొన్నటికి మొన్న కర్ణాటకలో యడ్యూరప్పతో కూడా ఇలాగే రాజీనామా చేయించేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. యడ్యూరప్ప పైన కూడా అవినీతి ఆరోపణలు బాగా పెరిగిపోయాయి. అలాగే యడ్డీపై చాలా మంత్రుల్లో అసంతృప్తి పెరిగిపోయింది. దీని ఫలితంగా జనాల్లో బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన మోడీ దిద్దుబాటు చర్యలకు దిగారు.

ఇందులో భాగంగానే యడ్డీతో రాజీనామా చేయించేశారు. మంత్రుల్లో కూడా చాలామందిని మార్చేశారు. సరే కొత్తగా కొలువైన బొమ్మై పై మంత్రులు, ఎంఎల్ఏల్లోనే అసంతృప్తి పెరిగిపోయింది. బొమ్మై సీఎం అయిన నాలుగు రోజులకే శాఖలపై కొందరు మంత్రుల్లో అసంతృప్తి బహిరంగంగానే బయటపడింది. దాంతో చాలామంది మంత్రులు, ఎంఎల్ఏలు సీఎంకు వ్యతిరేకమైపోయారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచేది అనుమానమనే అభిప్రాయం పెరిగిపోతోంది.

అంతకుముందు ఉత్తరాఖండ్ సీఎంను కూడా ఇలాగే మార్చేశారు. మొత్తం మీద బీజేపీ పాలిత రాష్ట్రాలపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందన్న విషయాన్ని మోదీ గ్రహించినట్లే ఉన్నారు. ఎందుకంటే ఈమధ్యనే జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికల్లో అస్సాం, పాండిచ్చేరిలో తప్ప ఇంకెక్కడా అధికారంలోకి రాలేకపోయింది. పశ్చిమబెంగాల్లో పరిస్ధితిని మెరుగుపరుచుకున్నా ఓటమి తప్పలేదు. అలాగే కేరళ, తమిళనాడులో కూడా ఓడిపోయింది. మొత్తం మీద జనాల వ్యతిరేకతను మోడి గుర్తిస్తున్నారనేందుకు సీఎంల మార్పే నిదర్శనమని చెప్పాలి.