చ‌వితి వేడుక‌ల‌కు హైకోర్టు ఓకే.. కానీ…!

రాష్ట్రంలో ఘ‌నంగా నిర్వ‌హించుకునే వినాయక చవితి వేడుకల విషయంలో ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై విమ‌ర్శ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. మండపాలు కట్టినా, గణపతి విగ్రహాలు పెట్టినా, నిమజ్జనం చేసినా కరోనా ప్రబలుతుంద‌ని పేర్కొంటూ.. ప్ర‌భుత్వం.. ఈ ఏడాది కూడా వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌ను బ‌హిరంగంగా నిర్వ‌హించుకునే అంశంపై నిషేధం విధించింది. వాస్తవానికి తెలంగాణతో పోలిస్తే ఏపీలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. ఖైరతాబాద్‌ గణేశ్‌ విగ్రహం తరహాలో ఒకేచోట వేలమంది గుమిగూడే పరిస్థితి రాష్ట్రంలో ఉండదు. అయిన‌ప్ప‌టికీ.. క‌రోనా తీవ్రత కొన్ని జిల్లాల్లో ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై కొంద‌రు ఆహ్వానించ‌గా.. మ‌రికొంద‌రు.. విభేదించారు.

ఈ క్ర‌మంలో రాష్ట్రంలో జరిగే వినాయక చవితి ఉత్సవాలపై ప్ర‌భుత్వం విధించిన ఆంక్ష‌ల‌ను స‌వాల్ చేస్తూ.. ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది. దీనిపై వెంట‌నే విచార‌ణ చేప‌ట్టిన రాష్ట్ర హైకోర్టు.. ప్ర‌భుత్వానికి కొంత అనుకూలంగా మ‌రికొంత ప్ర‌జ‌ల‌కు అనుకూలంగా తీర్పు వెలువ‌రించింది. ప్రైవేటు స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కులేదని హైకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని కోర్టు సూచించింది. అయితే.. ప‌బ్లిక్ స్థ‌లాల్లో మాత్రం ఎట్టిప‌రిస్థితిలోనూ చ‌వితి పందిళ్లు వేయ‌రాద‌న్న ఏపీ ప్ర‌భుత్వ వాద‌న‌ను కోర్టు స‌మ‌ర్ధించింది.

పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు పెట్టుకుని, ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలను హైకోర్టు సమర్థించింది. ప్రైవేటు స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అదేస‌మ‌యంలో నిమ‌జ్జ‌నం పేరుతో ఊరేగింపుల‌కు ఎట్టిప‌రిస్థితిలోనూ అనుమ‌తులు లేవ‌ని.. క‌రోనా ఉధృతికి అవ‌కాశం ఇచ్చే ఎలాంటి చ‌ర్య‌ల‌నూ అనుమ‌తించేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధిస్తూనే.. భ‌క్తుల‌కు ఒకింత వెసులుబాటు ఇవ్వ‌డంతో ఈ వివాదానికి తెర‌ప‌డిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.