రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. ఏపీలోనూ ఇప్పుడు మరోసారి ఇలాంటి పరిణామమే కనిపిస్తోంది. 2019 ఎన్నికల తర్వాత.. తీవ్రస్థాయిలో ఇరుకున పడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జట్టుకట్టారు. తద్వారా.. ఏపీలో ఎదగాలని అనుకున్నారు. అయితే.. ఈ పరిణామాలకు అప్పుడే బ్రేక్ పడిపోయిందని అంటున్నారు పరిశీలకులు. జరుగుతున్న వ్యవహారాలు.. బీజేపీకి-పవన్ దూరమయ్యాడనే వాదనను బలపరుస్తున్నాయని చెబుతు న్నారు.
ఏపీలో బలమైన పక్షంగా ఉన్న అధికారపార్టీని ఓడించాలంటే.. అంత ఈజీకాదు. ఈ విషయం పవన్‌కు తెలుసు. కానీ, ఇప్పుడు బీజేపీతో ఉన్న నేపథ్యంలో ఎందుకో ఆయన జగన్‌పై దూకుడుగా ముందుకు వెళ్లలేక పోతున్నారు. బీజేపీతో చేతులు కలపకముందు.. జగన్‌పై చేసిన కామెంట్లు రాజకీయంగా చర్చకు దారితీశాయి. కానీ, ఇప్పుడు పవన్ మౌనంగా ఉంటున్నారు. వాస్తవానికి ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత.. ఆ పార్టీతో కలిసి.. అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తామని.. వైసీపీని గద్దె దింపడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
ఈ క్రమంలో తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ.. బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేసిన పవన్.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత కూడా బీజేపీ తో కలిసి పోరుబాట పడతామన్నారు. యాత్రలు చేయాలని నిర్ణయించారు. కానీ, ఇంతలోనే.. అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. బీజేపీతో పవన్ అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. వారం వ్యవధిలో రెండు ఉద్యమాలకు పవన్ పిలుపు నిచ్చారు. ఒకటి.. ఉద్యోగ క్యాలెండర్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. రెండు.. రహదారుల దుస్థితిపై ప్రభుత్వం స్పందించాలని.
అయితే.. ఈ రెండు ఉద్యమాలకు కూడా బీజేపిని పవన్ ఆహ్వానించలేదు. ఎక్కడికక్కడ జనసేన నేతల ను మాత్రమే రంగంలోకి దింపారు. ఇక, బీజేపీ ఇప్పుడు.. వినాయకచవితి ఉత్సవాల నిషేధంపై ఉద్యమా నికి రెడీ అవుతోంది. ఈ విషయంలో పవన్ పార్టీ పట్టించుకోవడం లేదు. దీనిని బట్టి.. బీజేపీతో పవన్ దూరమవుతున్నాడనే సంకేతాలు వస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు.. పవన్‌ను నిర్దేశిస్తున్నారని.. జగన్ సహా కొందరు కీలక నేతలు, పార్టీలపై ఆయనను అదుపు చేస్తున్నారని.. అదేసమయంలో పార్టీ పుంజుకోవాలంటే.. ఇలా పొత్తులతో ప్రయోజనం లేదని భావిస్తున్నారని.. అందుకే.. పవన్ దూరమవడమే మంచిదనే అభిప్రాయంతో ఉన్నట్టు చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates