తెలంగాణలో రాజకీయ పార్టీలన్ని హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే దృష్టి పెట్టాయి. ఇప్పుడు ఎలాంటి అడుగులు వేసినా ఆ ఎన్నికల్లో విజయాన్ని లక్ష్యంగా చేసుకునే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఆ దిశగా తమ పార్టీ అభ్యర్థులను ముందుగానే రంగంలోకి దించాయి. అధికార టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో దిగడం ఖాయమైనట్లే. ఇక రాష్ట్రంలో మూడో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకూ అక్కడ పోటీపడే తమ అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ అభ్యర్థి విషయంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్‌లోని కొంతమంది సీనియర్ నేతలకు మధ్య విభేధాలు వచ్చినట్లు సమాచారం.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ ఎంపికైన తర్వాత తనపై వ్యతిరేకత వచ్చినప్పటికీ క్రమంగా అంతా సర్దుకుంటుంది. ఎంపీ రేవంత్ కూడా సరికొత్త దూకుడుతో దూసుకెళ్తున్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా సభలు ర్యాలీలు ధర్నాలు అంటూ ప్రజల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకున్న ఆయన అక్కడ మాజీ మంత్రి కొండా సురేఖను బరిలో దించాలని నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. హుజూరాబాద్‌లో ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీలను ఢీ కొట్టాలంటే బలమైన నాయకులు కావాలని రేవంత్ ఆలోచించి ఎంతో రాజకీయ అనుభవం కలిగిన కొండా సురేఖ పేరును ప్రకటించాలని వ్యూహాలు సిద్ధం చేసుకున్నారని తెలిసింది. రేవంత్ నచ్చజెప్పడంతో సురేఖ కూడా పోటీకి ఒప్పుకుందనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు రేవంత్ ప్రణాళికలకు పార్టీలోని కొంతమంది నాయకులు అడ్డుపడుతున్నారని టాక్.
ఈ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపిక విషయంలో టీఆర్ఎస్, బీజేపీ వ్యూహాన్ని అనుసరించి స్థానిక అభ్యర్థినే నిలబెట్టాలని కాంగ్రెస్ ముఖ్యనేతలు ఆ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌ను కోరారు. స్థానికేతరులను అక్కడ బరిలో దింపితే ఇబ్బందులు వస్తాయని వాళ్లు ఠాగూర్‌కు సూచించారు. ఇక టీఆర్ఎస్ దళితబంధుకు చెక్ చెప్పేలా దళిత అభ్యర్థిని నిలబెట్టాలని మరో వర్గం సూచించింది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని హుజూరాబాద్ ఎన్నికలో పోటీ చేయాలనే ఆశావహుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నట్లు పార్టీ తాజాగా వెల్లడించింది. దరఖాస్తులు సమర్పించిన నేతలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నెల 10 తర్వాత అధిష్ఠానానికి నివేదిక అందిచి అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపింది.
అయితే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ గెలవకపోయినప్పటికీ గౌరవప్రదమైన ఫలితాలు రావాలంటే కొండా సురేఖ లాంటి వాళ్లే పోటీ చేయాలని రేవంత్ గట్టి పట్టుదలతో ఉన్నాడు. పేరున్న నాయకురాలు కాబట్టి ఓట్లు పడే అవకాశముందనే ఆలోచన చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియకు తెరలేపడం ఆయనకు నచ్చడం లేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకే అవసరమైతే కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించి మరీ కొండా సురేఖనే బరిలో దించాలని రేవంత్ అనుకుంటున్నారని టాక్. మరి రేవంత్ పట్టుదల ఫలిస్తుందా? లేదా మరో అభ్యర్థిని పార్టీ ప్రకటిస్తుందా? అన్నది త్వరలోనే తేలనుంది.