ఆ కీల‌క నేత‌పై రేవంత్ గురి.. టీఆర్ఎస్‌కు దెబ్బేనా?

Revanth Reddy

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఎంపికైన త‌ర్వాత రేవంత్ రెడ్డి జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు. వచ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా అటు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలను ప్ర‌శ్నిస్తున్న ఆయ‌న‌.. మ‌రోవైపు పార్టీని బ‌లోపేతం చేసే చ‌ర్య‌ల‌కు పూనుకున్నారు. ఎవ‌రెన్ని వ్యాఖ్య‌లు చేస్తున్న‌ప్ప‌టికీ కాంగ్రెస్‌ను ప‌టిష్ఠ‌ప‌ర్చ‌డం కోసం త‌న‌దైన మార్గంలో సాగుతూ వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఇప్ప‌టికే టీఆర్ఎస్‌ను దెబ్బ కొట్టేందుకు కొంద‌రు నేత‌ల‌ను కాంగ్రెస్‌లోకి తీసుకువ‌చ్చేందుకు రేవంత్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ కీల‌క నేత‌ను త‌మ పార్టీలోకి తెచ్చేందుకు రేవంత్ ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నార‌నే ప్ర‌చారం జోరంద‌కుంది.

ఖ‌మ్మం జిల్లా టీఆర్ఎస్ నేత‌ల్లో ముఖ్య‌మైన వాళ్ల‌లో మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రెడ్డి ఒక‌రు. ఆయ‌న‌కు జిల్లాపై ప‌ట్టుంది. ఇప్పుడు ఈ మాజీ మంత్రిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. పాలేరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేంద‌ర్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిపోవ‌డంతో ఇక్క‌డ గులాబి పార్టీ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది. దీంతో నియోజ‌క‌వ‌ర్గంతో పాటు జిల్లాలో త‌న వ‌ర్గాన్ని కాపాడుకునేందుకు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ప్ర‌యత్నిస్తున్నార‌ని స‌మాచారం. మ‌రోవైపు పార్టీలో త‌న వ‌ర్గానికి త‌గిన గుర్తింపు ల‌భించ‌డం లేద‌ని ఆయ‌న అసంతృప్తితో్ ఉన్నారని ఈ కార‌ణంతోనే చాలా కాలం నుంచి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ ప‌రిస్థితుల్లో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావును కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చేలా రేవంత్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఉపేంద‌ర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడ‌డంతో పాలేరులో ఆ పార్టీకి ఓ బ‌ల‌మైన అభ్య‌ర్థి అవ‌స‌రం. ఈ విష‌యాన్ని గుర్తించిన రేవంత్‌.. అందుకోసం తుమ్మ‌ల‌పై గురి పెట్టార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెన్ నుంచి తుమ్మ‌ల‌ను పోటీలో దింపేలా రేవంత్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉన్న తుమ్మ‌ల కాంగ్రెస్‌లో చేరితే అక్క‌డ పార్టీ మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని రేవంత్ అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

టీడీపీలో ఉన్న స‌మ‌యంలో రేవంత్‌తో క‌లిసి తుమ్మ‌ల ప‌నిచేశారు. ఇప్పుడా అనుబంధంతోనే ఆయ‌న్ని కాంగ్రెస్‌లోకి రేవంత్ ఆహ్వానించే అవ‌కాశాలున్నాయి. కానీ ఎంతోకాలం పాటు టీడీపీతో కొన‌సాగిన తుమ్మ‌ల టీఆర్ఎస్‌లో చేరేందుకు ఎంత‌గానో ఆలోచించారు. స్వ‌యంగా సీఎం కేసీఆర్ ఇంటికి వ‌చ్చి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డంతో పాటు పార్టీలో త‌గిన ప్రాధాన్య‌త‌నిస్తాన‌ని చెప్ప‌డంతో తుమ్మ‌ల కారెక్కారు. అలాంటి ఆయ‌న ఇప్పుడు మ‌ళ్లీ పార్టీ మార‌తారా? అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త లేదు. అయితే ఒక‌వేళ తుమ్మ‌ల కాంగ్రెస్‌లో చేర‌క‌పోయినా ఆయ‌న కొడుకును పార్టీలోకి తీసుకొచ్చి ప‌రోక్షంగా తుమ్మ‌ల మ‌ద్ద‌తు పొందాల‌నేది రేవంత్ రెడ్డి ప్లాన్‌గా నిపుణులు చెబుతున్నారు.