రాజకీయాలంటేనే మహా విచిత్రమైనవి. నాయకులు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో చెప్పడం కష్టం. మంచి మిత్రులు శత్రువులుగా.. బద్ధ శత్రువులు మిత్రులుగా మారే సన్నివేశాలు రాజకీయాల్లో సాధారణమే. ఇక ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉంటే వాళ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరికొకరు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఒకే కుటుంబానికి చెందిన వేర్వేరు నాయకులతో ఉమ్మడి పరిచయాలు ఉండే నేతల పరిస్థితి దుర్భరమే. ఎటూ తేల్చుకోలేక కిందా మీదా పడుతుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ నాయకుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
సెప్టెంబర్ 2న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతిని పురష్కరించుకుని ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ హైదరాబాద్‌లో సంస్మరణ సభ నిర్వహించనున్నారు. ఇప్పుడీ సభ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ హయాంలో మంత్రులుగా పనిచేసిన వాళ్లతో పాటు వైఎస్‌కు రాజకీయ పక్షంగా సన్నిహితంగా మెలిగిన నాయకులను ఈ సంస్మరణ సభకు విజయమ్మ ఆహ్వానించడమే అందుకు కారణం. విజయమ్మ నుంచి ఆహ్వానాలు అందుకున్న నేతల్లో ప్రస్తుతం కొందరు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. వైసీపీలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ధర్మాన ప్రసాద్‌రావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తదితర ముఖ్యనేతలున్నారు. వీళ్లలో చాలా మందికి స్వయంగా ఫోన్ చేసి, మెసేజ్‌లో పంపి విజయమ్మ ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
విజయమ్మ ఆహ్వానంతో ఈ నేతలు సందిగ్ధంలో పడ్డారు. తమ ఆరాధ్య నాయకుడి సతీమణి ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రత్యేక సమావేశానికి వెళ్లాలా? వద్దా అనే సంశయంలో వైసీపీ నాయకులున్నారు. ఈ నేపథ్యంలో విజయమ్మ ఆహ్వాన విషయాన్ని ఆమె కుమారుడు వైసీపీ అధినేత జగన్ దృష్టికి కొంతమంది నేతలు తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై స్పందించిన జగన్ సమావేశానికి తానే వెళ్లట్లేదని అలాంటప్పుడు అనవసరంగా మీరు వెళ్లడం ఎందుకని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ సంస్మరణ సభకు వెళ్లొద్దని వైసీపీ నేతలకు జగన్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీంతో వైసీపీ నేతలెవరూ ఆ సమావేశానికి వెళ్లట్లేదనే స్పష్టత వచ్చింది.
ఇటు ఏపీలో వైసీపీ పార్టీకి గౌరవాధ్యక్షురాలిగా కొనసాగుతోన్న విజయమ్మ.. అటు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన తన కూతురు షర్మిలకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే తన చెల్లి పార్టీ పెట్టడం ఇష్టం లేని జగన్.. ఆమెను దూరం పెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో విజయమ్మ వైఎస్ సంస్మరణ సభకు ఏర్పాట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. రెండు వారాల క్రితం తాడేపల్లికి వెళ్లిన ఆమె తన కొడుకు జగన్ ఇంట్లో మూడు రోజులున్నారు. ఆ సమయంలోనే ఈ సంస్మరణ సభ గురించి చర్చించే ఉంటారనే బయట టాక్. అయినప్పటికీ అమ్మ పిలిచినా.. కొడుకు జగన్ ఆదేశాలతో వైసీపీ నేతలు ఈ సభకు వెళ్లడం లేదని సమాచారం.