ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఏర్పాటైన జాయింట్ కో ఆర్డినేషన్ కమిటీ (జేసీసీ)కి ఎవరు నేతృత్వం వహించాలనే విషయమై సస్పెన్సు పెరిగిపోతోంది. నేతృత్వం వహించే విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అయితే బాగుంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రతిపాదించారు. అయితే ఇదే సందర్భంలో మరో ఇద్దరి పేర్లు కూడా భాగస్తుల పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 19 ప్రతిపక్షాలు కలిసి రాబోయే ఎన్నికల్లో నరేంద్రమోడిని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో జేసీసీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమైనాయి సరే మరి కొత్తగా ఏర్పడిన కమిటికి నాయకత్వం ఎవరు వహించాలి ? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. కొత్తగా ఏర్పడిన కమిటిలో కాంగ్రెస్ మినహా మిగిలినవన్నీ ప్రాంతీయ పార్టీలే. పశ్చిమ బెంగాల్లో తృణమూల్, మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన, ఝార్ఖండ్ లో జేఎంఎం, తమిళనాడులో డీఎంకే, బీహార్ లో ఆర్జేడీ లాంటి పార్టీలకు తమ రాష్ట్రాల్లో ప్రాబల్యమున్న మాట వాస్తవమే. అయితే అవన్నీ కేవలం తమ రాష్ట్రాలకు మాత్రమే పరిమితమన్నది వాస్తవం.
ఇక వామపక్షాలు కూడా జాతీయ పార్టీలే కానీ వారికి దేశంలో చెప్పుకోతగ్గ బలం లేదు. సీపీఎం అన్నా కేరళలో అధికారంలో ఉంది కానీ సీపీఐని అసలు తలచుకొనే వారే లేరు. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయస్థాయిలో మంచి నెట్ వర్కున్న పార్టీ, కార్యకర్తలు, నేతల బలమున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే కాబట్టి సోనియానే జేసీసీకి నాయకత్వం వహించాలని సీతారామ్ చెప్పారు. నిజానికి కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతంత మాత్రమే అయినా మిగిలిన పార్టీలకన్నా మెరుగ్గా ఉందంతే. అందుకనే సోనియా పేరును ఏచూరి ప్రతిపాదించింది. అయితే ఇక్కడ ఓ సమస్య ఉంది.
అదేమిటంటే ఒకవైపు కాంగ్రెస్ కు అధ్యక్షురాలిగా ఉంటునే మరోవైపు జేసీసీకి నాయకత్వం వహించేంత ఫిజికల్ ఫిట్ నెస్ సోనియాకు లేదు. ఈ మధ్య సోనియా తరచూ అనారోగ్యం పాలవుతున్న విషయం అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇక్కడే సోనియాకు ప్రత్యామ్నాయంగా మమతబెనర్జీ, శరద్ పవార్ పేర్లు ప్రస్తావనకు వస్తున్నది. పవార్ కన్నా లేటెస్ట్ సెన్సేషన్ మమత వైపే పార్టీల అధినేతల మొగ్గు ఉన్నట్లు సమాచారం. అయితే ఇద్దరికి కూడా మైనస్ పాయింట్లున్నాయి.
వీళ్ళ మైనస్ పాయింట్లేమిటంటే ఇద్దరికీ ఇంగ్లీషు భాష రాదు. మమత అయినా బెంగాలీ యాసలోనే ఇంగ్లీషును ఏదోలా నెట్టుకొచ్చేస్తుంది. పవార్ కు వచ్చింది మరాఠీ మాత్రమే. హిందీ కూడా పెద్దగా రాదు. ఇక ఇంగ్లీషు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రాహల్ పేరు పరిశీలనకు వచ్చినా ఎవరు పెద్దగా మొగ్గు చూపలేదట. కాబట్టి ఆరోగ్యం సహకరించి నాయకత్వానికి అంగీకరిస్తే సోనియా లేకపోతే మమత లేదా పవార్లో ఎవరో ఒకరు జేసీసీకి నాయకత్వం వహించటం ఖాయమంటున్నారు. మరి చూడాలి చివరకు ఏమవుతుందో.