పవన్ కోసం అదిరిపోయే కథ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను దృష్టిలో ఉంచుకుని కథలు రాసే రచయితలు, దర్శకులు చాలామందే ఉంటారు. కానీ ఆ కథలన్నీ పవన్ దగ్గరికి వెళ్లవు. ఒకవేళ తనకు అవకాశం దక్కితే పవన్‌తో చేయడానికి అదిరిపోయే కథ తన దగ్గర రెడీగా ఉందని అంటున్నాడు కరుణ్ కుమార్. ‘పలాస 1978’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రంలోనే గొప్ప పనితనం చూపించాడు కరుణ్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడిన కరుణ్ కుమార్.. పవర్ స్టార్ మీద తన అభిమానాన్ని చాటుుకన్నాడు. ఇండియాలో ఇద్దరు హీరోల స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుందని.. ఆ ఇద్దరిలో ఒకరు సూపర్ స్టార్ రజినీకాంత్ అయితే.. మరొకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అన్నాడు కరుణ్. వీళ్లిద్దరూ స్క్రీన్ మీద అలా నడిస్తే చాలని కరుణ్ అన్నాడు. పవన్ స్టేచర్‌కు తగ్గ కథ తన దగ్గర ఉందని కరుణ్ తెలిపాడు.

ఈ కథతో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే తెలుగు వాళ్లే కాక ఇండియా మొత్తం గొప్పగా ఆ చిత్రాన్ని ఆదరిస్తారని కరుణ్ కుమార్ అన్నాడు. పవన్ కనుక ఆ కథను చేస్తే అది వేరే లెవెల్లో ఉంటుందని.. ఇప్పటి వరకు పవన్ చేయని సబ్జెక్ట్ అదని.. ఆయన కనుక ఈ సినిమా చేస్తే అభిమానులతో పాటు ప్రేక్షకులందరూ పండుగ చేసుకునేలా ఆ సినిమా ఉంటుందని కరుణ్ తెలిపాడు. ‘పలాస’తో మెగా కాంపౌండ్లోకి ఎంట్రీ సంపాదించాడు కరుణ్. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు ‘పలాస’ బాగా నచ్చి.. ఆహా ఓటీటీ కోసం కరుణ్‌తో ‘మెట్రో కథలు’ అనే వెబ్ సిరీస్ తీయించాడు.

‘శ్రీదేవి సోడా సెంటర్’ తర్వాత కరుణ్ గీతా ఆర్ట్స్‌లోనే ఓ సినిమా చేస్తాడని కూడా అంటున్నారు. మరి తన దగ్గరున్న అద్భుతమైన కథను అరవింద్‌కు చెప్పడమో లేక పవన్ దగ్గరికి తీసుకెళ్లడమో చేస్తే.. పవన్ దాన్ని మెచ్చి భవిష్యత్తులో అవకాశం ఇస్తాడేమో చూడాలి. అనుభవం, సక్సెస్‌ రేట్ చూడకుండా చాలామంది అప్‌కమింగ్ డైరెక్టర్లకు అవకాశం ఇచ్చిన పవన్.. కరుణ్‌కు ఛాన్స్ ఎందుకివ్వడు?