సీనియర్ల వ్యతిరేకత మధ్య పీసీసీ పగ్గాలు దక్కించుకున్న రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లే ఉంది. తెలుగుదేశం పార్టీ నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ కు ఇంత తొందరగా రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించడాన్ని చాలామంది సీనియర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే చేసేదేమీ లేక మాట్లాడకుండా కూర్చున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి సీనియర్ నేత కూడా తన ఆగ్రహాన్ని బాహాటంగా ప్రకటించి చివరకు సర్దుకు పోతున్నారు.
కోమటిరెడ్డి లాంటి గట్టి నేతకే తప్పనపుడు ఇక మిగిలిన నేతల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ విషయాలన్నీ రేవంత్ కు తెలీకుండా ఏమీ లేదు. ఇపుడు తన నాయకత్వాన్ని ఆమోదించినా రేపు అవకాశం దొరికితే తనను ఎంతగా తొక్కేసేందుకు ప్రయత్నిస్తారో ఊహించలేనంత అమాయకుడు కాదు రేవంత్. అందుకనే ఇప్పటినుండే ముందు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే పార్టీలో ప్రత్యేకంగా తన వర్గాన్ని తయారుచేసుకుంటున్నారని తెలుస్తోంది.
ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని లేకపోతే ఇంతకాలం నిరాదరణకు గురైన నేతల్లో గట్టివారిని ఎంచుకుని మరీ తన మద్దతుదారులుగా రెడీ చేసుకుంటున్నారట. మొత్తం 119 నియోజకవర్గాల్లో తన నాయకత్వానికి సవాలు విసరగలిగిన నేతలెవరు ? తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తన నాయకత్వాన్ని ఆమోదించినవారెవరు ? మనస్ఫూర్తిగా తన నాయకత్వాన్ని అంగీకరించెదవరు ? అనే పద్ధతిలో నేతలను రేవంత్ వడపోస్తున్నట్లు సమాచారం.
మొదటి రెండు క్యాటగిరిల్లోని నేతల నియోజకవర్గాలపై రేవంత్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారట. ఇలాంటి నియోజకవర్గాల్లోని ప్రస్తుత నేతలకు ప్రత్యామ్నాయంగా తన మద్దతుదారులను యాక్టివ్ చేయించాలనేది రేవంత్ ప్లాన్ గా తెలుస్తోంది. రేపు ఎటుపోయి ఏమైనా సీనియర్లు తనను వ్యతిరేకించినపుడు తన మద్దతుదారులు తనకు అండగా నిలవాలనేట్లుగా రేవంత్ ప్లాన్ చేస్తున్నారట. మరి రేవంత్ వ్యూహాలు ఎంతవరకు వర్కవుటవుతాయో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates