తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్ అడ్డంగా బుక్కయ్యాడు. ఓ మహిళతో అర్థన్నంగా వీడియో కాల్స్ మాట్లాడి.. చివరకు తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అర్థనగంగా ఒక మహిళా పార్టీ కార్యకర్తతో వీడియో కాల్ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో.. ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
ఈ వీడియోను బిజెపికి చెందిన నేతగా చెప్పుకుంటున్న మదన్ రవిచంద్రన్ తన యూట్యూబ్ చానల్ ‘మదన్ డైరీస్’లో పోస్టు చేశారు. కాగా, ఓ సందర్భంలో ఈ ఆరోపణలు కొట్టిపడేసిన కెటి రాఘవన్, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు. తమిళనాడు ప్రజలు, పార్టీ కార్యకర్తలు, తనతో ఉన్నవారికి తానెంటో తెలుసునని, ఎటువంటి లాభం లేకుండా 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నానని అన్నారు. అనంతరం తనను కించపరిచేందుకు ఇలా చేశారని, ఈ విషయంపై రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలైతో మాట్లాడానని, తన పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు.
తన యూట్యూబ్ చానల్లో మదన్ మాట్లాడుతూ… బిజెపికి చెందిన 15 మంది నేతలకు సంబంధించిన ఇలాంటి అసభ్యకర వీడియోలు, ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఒక్కొక్కటిగా విడుదల చేస్తానని చెప్పారు. కెటి రాఘవన్ తనను తాను పెద్దమనిషిగా చాటుకుంటున్నందునే ఆయన వీడియోలు బయటపెట్టానన్నారు. బిజెపి నేతల వికృత చేష్టలు, లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఈ స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టాలన్న ఆలోచన వచ్చిందని అన్నారు. ఇటువంటి వ్యక్తుల నుండి పార్టీని ప్రక్షాళన చేయాల్సి ఉందని అన్నారు. కాగా, మదన్ ఉద్దేశాన్ని అన్నమలై తోసిపుచ్చారు. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మలార్కోడి నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేశామని, ఈ బృందం చేస్తోన్న ఆరోపణలపై కమిషన్ విచారణ చేపట్టి… నిందితులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.