ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న కేసీఆర్ అంటే మొండిఘటమనే పేరుంది. ఆయన అనుకున్నది సాధించి తీరుతారని బయట అందరూ అనుకుంటుంటారు. ఇప్పుడు ఆ సంగతి ఎందుకంటారా.. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలకు కారణమైన హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం కోసం కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహాలే అందుకు నిదర్శనం. తనపై భూ కబ్జాకోరు ఆరోపణలు రావడంతో టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పడమే కాకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ తరపున ఉప ఎన్నికకు సిద్ధమైన సంగతి తెలిసిందే.
టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయి సీఏం కేసీఆర్‌నే ఎదిరిస్తూ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం కోసం ఈటల శాయాశక్తులా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న కేసీఆర్.. అందు కోసం సామధనభేధదండోపాయాలను ప్రయోగించే పనిలో పడ్డారు. ఇప్పటికే హుజూరాబాద్ వేదికగా దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్.. ఆ నియోజకవర్గంలో ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను పరుగెత్తిస్తున్నారు. మరోవైపు తన మంత్రులతో ఈటలపై మాటల దాడి చేయిస్తున్న కేసీఆర్.. ఇంకో వైపు నుంచి ఈ మాజీ మంత్రి అనుచరులను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలను మొదలెట్టినట్లు సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ మరింత దూకుడు పెంచింది. ఈటల వ్యూహాలపై దెబ్బ కొట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పుడిక ఈటల అనుచర వర్గాన్ని తమవైపునకు తిప్పే దిశగా అడుగులు వేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈటల ప్రధాన అనుచరుడైన కరీంనగర్ కేడీసీసీ బ్యాంక్ వైస్ ఛైర్మన్ పింగిలి రమేశ్ బీజేపీ నుంచి బయటకు వచ్చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హిందూత్వ భావాజలం ఉన్న బీజేపీలో ఇమడలేక.. బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించిన రమేశ్.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు బాగున్నాయని టీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని పేర్కొనడం గమనార్హం.
ఇప్పుడు టీఆర్ఎస్లో చేరతానని రమేశ్ ప్రకటించడం ఈటలకు ఓ రకంగా పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఓ వైపు ప్రజలను టీఆర్ఎస్వైపు ఆకర్షించడంతో పాటు మరోవైపు ఈటలను బలహీనంగా మార్చాలనే కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తున్నారు రాజకీయ వేత్తలు అంటున్నారు. అందుకు రమేశ్ వ్యవహారాన్నే ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇప్పుడు రమేశ్‌తో పాటు మరో నాయకుడు చుక్కా రంజిత్ కూడా బీజేపీకి గుడ్‌బై చెప్పారు. మరి ఇక ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి.. ఆ ఎన్నికలు జరిగే లోపు మరెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఆసక్తి మాత్రం ప్రజల్లో పెరుగుతోంది.