తెలుగుదేశానికి ఇపుడు అన్ని వర్గాల మద్దతు కావాలి. టీడీపీ అంటే బీసీల పార్టీ అని ముద్ర పడింది. అయితే ఆ బీసీలను వైసీపీ ఒడుపుగా లాగేసింది. 2019 ఎన్నికల్లో వారు బాగానే ఫ్యాన్ పార్టీ వైపు టర్న్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వారిలో కొంత అసంతృప్తి ఉన్నా కూడా పూర్తిగా టీడీపీ కొమ్ము కాస్తారని ఎవరూ చెప్పలేరు. ఫిఫ్టీ ఫిఫ్టీ నిష్పత్తిలో బీసీల ఓట్లను వైసీపీతో కలసి పంచుకోవలసిందే. మరో వైపు అగ్ర కులాలు టీడీపీ వైపు ఉన్నా కూడా వారి ఓట్ల శాతం తక్కువ. దాంతో టీడీపీకి మైనారిటీలు, దళితుల మద్దతు తప్పనిసరిగా కావాలి.
కానీ ఆ వర్గాలు వైసీపీని గట్టిగానే పట్టుకుని ఉన్నాయి. టీడీపీ వైపు చూసే అవకాశాలు లేవు. అయితే చంద్రబాబు తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన నేరుగా అనలేని కొన్ని మాటలు ఉన్నాయి. వాటిని తన పార్టీ వారి ద్వారా అనిపించి మైనారిటీలను వైసీపీకి దూరం చేయాలని ఆలోచిస్తున్నారు. జగన్ బీజేపీతో అంటకాగుతున్నారు అని బాబు డైరెక్ట్ గా అనలేరు. అలా అని కమలం పార్టీతో స్నేహ బంధాన్ని దూరం చేసుకోలేరు. అందుకే తనకు నమ్మిన బంటుగా ఉన్న మాజీ మంత్రి ఎన్ ఎం డీ ఫరూఖ్ ద్వారా ఈ మాటలను అనిపిస్తున్నారు.
రాయలసీమలో కర్నూల్, కడప వంటి చోట్ల ముస్లిం మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిని ఆకట్టుకోవడానికి ఫరూఖ్ ని రంగంలోకి దింపారు. తాజాగా ఫరూఖ్ మాట్లాడుతూ వైసీపీ బీజేపీలది చీకటి బంధం అంటూ విమర్శించారు. ఈ రెండు పార్టీలు కలసికట్టుగానే ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. పైకి మాత్రం విభేదిస్తున్నట్లుగా నాటకాలు ఆడుతున్నాయని కూడా ఫరూఖ్ ఒక రేంజిలో చెలరేగారు. దానికి నిదర్శనం విజయసాయిరెడ్డికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో స్థానం కల్పించడం అని కూడా ఆయన చెబుతున్నారు. ఆలోచిస్తే ఇది నిజమే అనిపిస్తుంది.
ఎందుకంటే బీజేపీ అనుమతి, అంగీకారం లేకపోతే ఈ కీలకమైన పదవి వైసీపీ ఎంపీకి ఎలా దక్కుతుంది అన్న మాట ఉంది. కానీ ఫరూఖ్ వంటి వారి విమర్శలను మైనారిటీలు ఎంతవరకూ పట్టించుకుంటారు అన్నదే చర్చ. ఫరూఖ్ కర్నూల్ జిల్లాలో ఒకనాడు గట్టి నేత. ఆయన ఎన్టీయార్ హయాం నుంచి టీడీపీలో ఉన్నారు. విభజన తరువాత ఏపీ శాసనమండలి ఫస్ట్ చైర్మన్ గా కూడా ఆయన పనిచేశారు. ఈ సీనియర్ మైనారిటీ నేత ద్వారా మైనారిటీలను తమ వైపు తిప్పుకోవాలని బాబు చూస్తున్నారు. ఇది టఫ్ టాస్క్. వర్కౌట్ అయితే గొప్ప విషయమే.