తొందరలో జరగబోయే హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జనసేన మద్దతు తీసుకునే విషయంలో ఏమీ ఆలోచించలేదని బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మద్దతు విషయమై మాట్లాడారా అన్న ప్రశ్నకు ఇంకా లేదన్నారు. మద్దతు తీసుకునే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఇపుడా విషయాన్ని ఆలోచించ లేదన్నారు. బీజేపీ-జనసేన మధ్య పొత్తుందా అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు.
జనసేన విషయంపై ఏమడిగినా పార్టీలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని సమాధానాలను దాటవేశారు. బండి సమాధానాలు చెప్పిన విధానం చూస్తే జనసేనతో పొత్తు విషయమై పెద్దగా ఆసక్తి ఉన్నట్లు కనబడలేదు. ఇదే బండి గ్రేటర్ ఎన్నికల సమయంలో తెలంగాణాలో జనసేనతో బీజేపీకి పొత్తు లేదని మీడియాతోనే చెప్పిన విషయం అందరికీ గుర్తుండేఉంటుంది. ఏపిలో జనసేనకు పొత్తుంటే అది ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని కూడా స్పష్టంగా చెప్పారు. అప్పటి నుండి పవన్ తో తెలంగాణా బీజేపీ నేతలు పెద్దగా భేటీ అయ్యింది లేదు.
నిజానికి హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థిగా గెలవటం ఈటలకు ఎంత ముఖ్యమో పార్టీగా కమలానికి అంతే అవసరం. ఈ దశలో మద్దతు ఇవ్వటానికి ఎవరు ముందుకొచ్చినా తీసుకుంటామని చెప్పాల్సిన బండి పవన్ విషయంలో పెద్దగా ఆసక్తి లేనట్లుగా మాట్లాడమే ఆశ్చర్యంగా ఉంది. గట్టిగా చెప్పాలంటే హుజూరాబాద్ లో బీజేపీకి ప్రత్యేకంగా ఓటింగ్ అంటూ లేదు. ఈటలకు పడే ఓట్లన్నీ ఆయన్ను వ్యక్తిగతంగా చూసి పడే ఓట్లే అని అందరికీ తెలిసిందే.
మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈటలకు 1 లక్ష చిల్లర ఓట్లొస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కౌశిక్ రెడ్డికి 62 వేల ఓట్లువచ్చాయి. బీజేపీ అభ్యర్థికి అసలు డిపాజిట్లు కూడా రాలేదు. అంటే ఇక్కడ బీజేపీ ఎంత బలంగా ఉందో తెలిసిపోతోంది. ఇలాంటి ఉప ఎన్నికలో మద్దతిస్తామని ఎవరు ముందుకు వచ్చినా, మద్దతు తీసుకునేందుకు ఎవరిని వదులుకోకూడదు. అలాంటిది పవన్ విషయం ఇంకా ఆలోచించలేదని, పార్టీలో చర్చించి నిర్ణయిస్తామని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. జనసేన మద్దతు తీసుకుంటామని బండి చెబితే పార్టీలో ఎవరైనా వద్దంటారా ?
Gulte Telugu Telugu Political and Movie News Updates