తాలిబన్లకు సవాలు విసురుతున్న పంజ్ షీర్

ఆఫ్ఘనిస్ధాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ తాలిబన్లకు సవాలు విసురుతున్నారు. దేశంయావత్తు తాలిబన్ల చేతిలోకి వెళ్ళిపోయినా ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ మాత్రం తానే అధ్యక్షడినని ప్రకటించుకున్నారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీయే దేశం విడిచిపారిపోయిన తర్వాత దేశం మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత సలేహ్ ఏమి ప్రకటించుకుంటే మాత్రం ఉపయోగం ఏమిటి ? ఇపుడిదే అంశంపై అంతర్జాతీయస్ధాయిలో చర్చ మొదలైంది.

తనను తాను ఆపద్ధర్మ అధ్యక్షునిగా ప్రకటించుకున్న సలేహ్ ఇపుడెక్కడున్నారు ? ఎక్కడంటే పంజ్ షీర్ అనే లోయప్రాంతంలో. పంజ్ షీర్ అంటే పుష్తూన్ భాషలో అయిదు సింహాలని అర్ధం. సలేహ్ ది కూడా ఈ ప్రాంతమే. పంజ్ షీర్ వైపు అంతర్జాతీయ సమాజం ఇపుడు ఎందుకు చూస్తోందంటే తాలిబన్లను కూడా ఓ ఆటాడించన తాలిబన్ శతృవులుండేది పంజ్ షీర్ లోయలోనే కాబట్టి. తాలిబన్ల లాంటి అత్యంత క్రూరమైన సైన్యమే పంజ్ షీర్ లో కూడా ఉంది.

ఇక్కడున్న సుమారు లక్షన్నరవరకు జనాభా తాలిబన్లకు పూర్తి విరుద్ధం. ఈలోయంతా నూరుశాతం పర్వతాలు, గుహలతో నిండిపోయుంటుంది. అందుకనే తాలిబన్లు, పాకిస్ధాన్ సైన్యాలు వీళ్ళపై ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా గెలవలేకపోయారు. అంతకుముందు రష్యా సైన్యం కూడా పంజ్ షీర్ లోయపై దండెత్తినా లాభంలేకపోయింది. గడచిన 20 ఏళ్ళుగా పంజ్ షీర్ సైన్యం తాలిబన్లకు కొరకరాని కొయ్యగా తయారైంది. ఈ లోయకు చెందిన వ్యక్తే సలేహ్ కూడా. ఈయన తాలిబన్లకు బద్ద విరోధి.

తాలిబన్లు ఆఫ్ఘనిస్ధాన్ను స్వాధీనం చేసుకోగానే సలేహ్ పంజ్ షీర్ లోయలోకే పారిపోయారు. వెంటనే అక్కడి వాళ్ళంతా సలేహ్ తో భేటీఅయి మద్దతు ప్రకటించారు. గతంలో తాలిబన్లను ఓడించేందుకు అమెరికా, నాటో దళాలకు మార్గదర్శకత్వం వహించింది ఈ పంజ్ షీర్ ప్రముఖులే. వీళ్ళ భాగస్వామ్యం లేకుండా అమెరికా సంకీర్ణదళాలు తాలిబన్లపై విజయం సాధించటం కష్టమే. పంజ్ షీర్ ప్రాంతం తజకిస్ధాన్ దేశం భూభాగంలోకి వస్తుంది. తజకిస్ధాన్లో పంజ్ షీర్లదే అధికారం.

ముస్లిం ఆధిపత్యం ఉండే తజకిస్ధాన్ అంటే ఇటు రష్యా, అటు చైనా, పాకిస్ధాన్ కు కూడా పడదు. విచిత్రమేమిటంటే తజకిస్ధాన్-భారత్ మంచి స్నేహితులు. ఇలాంటి పంజ్ షీర్లతో కలిసి తాలిబన్లపై తాను యుద్ధం చేస్తానంటున్నాడు సలేహ్. నిజానికి పంజ్ షీర్లపై ఆధిపత్యం సాధించాలని తాలిబన్లు ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. తమపై తాలిబన్లు ఎన్నిసార్లు దండెత్తినా ప్రతీసారి పంజ్ షీర్లు తిప్పికొట్టి తమ లోయలో నుండి వాళ్ళను తరిమేశారు. ఇందుకే పంజ్ షీర్ వైపు ఇపుడు ప్రపంచమంతా చూస్తోంది. మరి పంజ్ షీర్ ఏమి చేస్తుందో చూడాల్సిందే.