జగన్ పాపులారిటీ ఇలా పడిపోయిందేంటి?

ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని మెజారిటీతో ఎన్నికల్లో గెలిచి ఎన్నో అంచనాల మధ్య, 27 నెలల కిందట అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు.. తొలి రెండేళ్లు ఎదురు లేదన్నట్లే సాగిపోయింది.

ఆరంభం నుంచి అనాలోచిత నిర్ణయాల కారణంగా విమర్శలు, వివాదాలు, కోర్టు మొట్టికాయలు కామన్‌యే అయినప్పటికీ.. ప్రజాదరణ విషయంలో జగన్‌కు తిరుగులేదన్నట్లే సాగింది. పాలన గురించి ప్రతిపక్షాలు, విమర్శకులు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. సంక్షేమ కార్యక్రమాలను పట్టుబట్టి అమలు చేయడం ద్వారా సామాన్య జనంలో జగన్ పాపులారిటీకి ఢోకా లేనట్లే కనిపించింది.

కానీ గత కొన్ని నెలల్లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నట్లే కనిపిస్తోంది. కేవలం సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని గాలికొదిలేయడం, పరిపాలన మీద పూర్తిగా పట్టు కోల్పోవడం, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే మార్గాలన్నింటినీ మూసేస్తుండటంతో జగన్ సర్కారు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిపోయింది.

ఏపీ సర్కారు ఆర్థిక పరిస్థితి అద్వాన్నంగా తయారై ప్రభుత్వ ఉద్యోగులకు నెల నెలా జీతాలు సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి తలెత్తడం, ఏపీలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవడంతో జనాల్లో జగన్ పాపులారిటీ ఒక్కసారిగా పడిపోయిందని స్పష్టమవుతోంది. ఏటా మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరును సమీక్షించే ఇండియా టుడే సంస్థ… ఈ ఏడాది కూడా తన సర్వే చేపట్టి ఫలితాలు వెల్లడించింది. ఇందులో జగన్ టాప్-10లో నిలవలేకపోయారు. ఆయనకు 19 శాతం కంటే తక్కువ ఓటింగ్ శాతం వచ్చింది.

ఇండియా టుడే సర్వే చేస్తే ఎవరికి గొప్ప అని జగన్ అభిమానులు తీసి పడేయడానికి కూడా లేదు. ఎందుకంటే గత ఏడాది జగన్‌ను ఇండియాలోనే ఉత్తమ ముఖ్యమంత్రుల్లో ఒకరిగా పేర్కొంది. టాప్-3లో చోటిచ్చింది. అప్పుడు జగన్ అభిమానులు దీన్నో పెద్ద సర్టిఫికెట్ లాగా చూపించుకున్నారు. అలాంటిది ఇప్పుడు జగన్ అదే జాబితాలో టాప్-10లో లేరు. ఈ జాబితాలో 42 శాతం ఓటింగ్‌తో తమిళనాడు సీఎం స్టాలిన్ అగ్రస్థానం సాధించడం విశేషం. ఆయనకు 42 శాతం మద్దతు లభిస్తే.. జగన్ 19 శాతం కంటే తక్కువ ఓటింగ్‌తో టాప్-10 బయటికి వెళ్లిపోయారు.

కరోనా నేపథ్యంలో పీఎం దగ్గర్నుంచి సీఎంల వరకు అంరదూ ఎంతో కొంత వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారే కానీ.. జగన్ పాపులారిటీ మాత్రం మరీ పడిపోయిందని స్పష్టమవుతోంది. సంబంధిత సర్వే రిపోర్ట్‌లను జగన్ ప్రత్యర్థులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఆయన ఇమేజ్‌ను బాగానే డ్యామేజ్ చేస్తున్నారు.