వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని తరలించే విషయమై జగన్మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారట. అక్టోబర్ నెలాఖరుకు పార్టీ సెంట్రల్ ఆఫీసును విశాఖపట్నానికి తరలించాలని డిసైడ్ అయిపోయారని సమాచారం. ప్రస్తుతం పార్టీ కేంద్ర కార్యాలయం అమరావతికి దగ్గరలోని తాడికొండలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ పరంగా కార్యాలయాలను తరలించటానికి కొద్దిగా ఆలస్యమైనా ముందు పార్టీ ఆఫీసును తరలించటంలో ఎలాంటి ఇబ్బంది లేదు.
అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే మూడు రాజధానుల కాన్సెప్టును జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఈ అంశంపై అనేక వాద, వివాదాలు నడుస్తున్నాయి. వైజాగ్ కు పరిపాలనా రాజధాని, కర్నూలుకు న్యాయరాజధాని, అమరావతిలో శాసన రాజధాని ఉంటుందని జగన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. దీనిపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. అలాగే రాజధాని పరిధిలోని రైతులు కూడా కోర్టులో కేసువేశారు.
మూడు రాజధానుల అంశంతో తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్రప్రభుత్వం ఎప్పుడో తేల్చేసింది. కాబట్టి హైకోర్టులో ఉన్న కేసులు గనుక పరిష్కారమైపోతే వెంటనే వైజాగ్ కు జగన్ తరలిపోవటం ఖాయమని తేలిపోయింది. అంతర్లీనంగా అందుకు అవసరమైన ప్రయత్నాలు, ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా పడిన కేసులను కొట్టేయించుకునేందుకు ప్రభుత్వపరంగా గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి.
జగన్ ప్రయత్నాలకు కేంద్రం కూడా సానుకూలంగా వ్యవహరిస్తే వెంటనే కర్నూలుకు హైకోర్టు తరలిపోతుంది. దాంతో పరిపాలనా రాజధానిని జగన్ వైజాగ్ కు తరలించేస్తారు. ఈలోగానే ముందు పార్టీ సెంట్రల్ ఆఫీసును వైజాగ్ కు తరలించేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఇప్పటికిప్పుడు వైజాగ్ లో పార్టీ ఆఫీసు కట్టాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఓ ప్రైవేటు భవన్నానే తీసుకుంటున్నారట. అంటే తొందరలోనే సెక్రటేరియట్ కూడా వైజాగ్ వెళ్ళిపోవటం ఖాయమని అర్ధమైపోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates