నాడు బాబు.. నేడు జ‌గ‌న్‌.. మోడీ బాధితులే..

“తాను చెప్పింది వినాలి. తాను చెప్పింది చేయాలి. ఇంత‌కు మించి.. అంటే క‌ష్ట‌మే!” – ఇదీ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విధానం. ఆయ‌న గురించి చాలా ద‌గ్గ‌రగా తెలిసిన వారు.. ఇదే విష‌యాన్ని చెబుతుంటారు. మోడీ అనుకున్న‌దే జ‌రుగుతుంది. ఆయ‌న త‌ల‌పెట్టిందే పూర్త‌వుతుంది! అనే మాట బీజేపీలోనూ వినిపిస్తూనే ఉంటుంది. దీనికి విరుద్ధంగా లేక‌.. మోడీ త‌ల‌పుల‌కు వ్య‌తిరేకంగా ఎవ‌రు మాట్లాడినా.. ఆయ‌న ప‌క్క‌న పెట్ట‌డం.. లేదా ప‌ట్టించుకోకుండా వేధించ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మేన‌ని అంటారు కూడా.

బీజేపీలోనే చాలా మంది నేత‌లు.. సీనియ‌ర్లు మోడీ బాధితులుగా మిగిలిపోయారు. ఎల్ కే అద్వానీ, మురళీ మ‌నోహ‌ర్ జోషి వంటి వారిని మోడీ ప‌క్క‌న పెట్టిన విష‌యం తెలిసిందే. ఒక్క సొంత పార్టీలోనే కాదు.. మోడీతో విభేదించేవారిని కూడా ఆయ‌న స‌హించ‌రు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొలువుదీరి రెండున్న‌రేళ్లు పూర్త‌య్యాయి. మ‌రో రెండున్న‌రేళ్ల‌లో ఎన్నిక‌ల‌కు వెళ్లాలి. చివ‌రి ఆరు మాసాలు ఎన్నిక‌ల వేడి తీసేస్తే.. మిగిలి స‌మ‌యం కేవ‌లం రెండేళ్లు మాత్ర‌మే.

ఈ రెండేళ్ల కాలంలో ఆయ‌న ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డం సాధ్య‌మేనా? ఏపీకి ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం పూర్తి, వెనుక‌బ‌డిన జిల్లాల అభివృద్ధి వంటివి సాధ్య‌మేనా? అంటే.. కాద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. జ‌గ‌న్‌కు సంక‌ల్పం లేక కాదు. మోడీ ఇష్ట‌ప‌డ‌డం లేదు క‌నుక‌! ఒక్క జ‌గ‌న‌నే కాదు. గ‌తంలో ముఖ్య‌మంత్రిగా చేసిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా మోడీ బాధితుడిగా మిగిలిపోయారు. ఆయ‌న కూడా హోదా విష‌యంలోను, పోల‌వ‌రం విష‌యంలోను.. వెనుక‌బ‌డిన జిల్లాల విష‌యంలోనూ కేంద్ర వ‌ద్ద బాగానే గ‌ళం వినిపించారు.

కానీ, త‌న సొంత రాష్ట్రంపై ఉన్న ప్రేమ‌తో.. మోడీ.. ఏపీ వంటి రాష్ట్రాల‌ను తీవ్ర అల‌క్ష్యం చేస్తున్నార‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌. ఈ క్ర‌మంలోనే ఏపీ నుంచి ఎవ‌రు ఏమి కోరినా.. ఆచి తూచి వ్య‌వ‌హ‌రించ‌డంతోపాటు.. అప్ప‌టికే తాను తీసుకున్న నిర్ణ‌యాల మేర‌కు ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వాద‌న కూడా ఉంది. దీంతో మోడీ వ్య‌తిరేకిస్తున్న లేదా.. ఇవ్వ‌న‌ని చెప్పిన విష‌యాల‌ను ప‌దేప‌దే అడుగుతున్న లేదా అడిగిన వారితో ఆయ‌న మౌనంగానే వైరం కొన‌సాగిస్తున్నార‌ని చెబుతున్నారు. గ‌తంలో చంద్ర‌బాబుకు మోడీ కి చెడింది ఇక్క‌డేన‌ని అప్ప‌ట్లోనే విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి.

ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ విష‌యంలోనూ మోడీ డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. పైకి స‌హ‌క‌రిస్తున్న‌ట్టుగా వుంటూనే.. త‌న ప‌నులు చేయించుకుంటున్నారు. కీల‌క వ్య‌వ‌సాయ బిల్లుల‌కు వైసీపీ నుంచి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డంలో మోడీ స‌క్సెస్ అయ్యారు. న‌త్వానీకి.. రాజ్య‌సీటును ఇప్పించుకోవ‌డంలోనూ విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, జ‌గ‌న్ కోరిన విష‌యాల‌పై మాత్రం క‌ఠినంగా ఉంటున్నారు. అలాగ‌ని.. ఎదిరించే ప‌రిస్థితి కూడా లేకుండా చేస్తున్నార‌నే వాద‌న ఉంది. గ‌తంలో చంద్ర‌బాబు కూడా ఇలానే డిఫెన్స్‌లో ప‌డిపోయారు. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి జ‌గ‌న్ ఎదుర్కొంటున్నార‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఏదేమైనా.. మోడీ మారితే త‌ప్ప ఏపీకి మంచి రోజులువ‌చ్చేలా లేవ‌ని చెబుతున్నారు.