వీళ్ళ పరిస్ధితిని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. వివిధ కారణాల వల్ల అధినేత చంద్రబాబునాయుడుపై నలుగురు టీడీపీ ఎంఎల్ఏలు తిరుగుబాటు చేశారు. మొదటగా గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పార్టీకి వ్యతిరేకంగా గొంతు విప్పారు. వంశీ తర్వాత గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ మద్దాలి గిరి, చీరాల ఎంఎల్ఏ కరణం బలరాం, విశాఖ ధక్షిణం ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ కూడా చంద్రబాబుకు దూరమయ్యారు.
ఈ నలుగురు ఎంఎల్ఏలకు చంద్రబాబుతో చెడిన తర్వాత పార్టీకి దూరమయ్యారు కానీ ఎంఎల్ఏ పదవులకు మాత్రం రాజీనామా చేయలేదు. వీళ్ళ దారిలోనే విశాఖ ఉత్తరం ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారనే అనుకోవాలి. ఇక్కడ గమనించాల్సిందేమంటే మొదటి నలుగురు చంద్రబాబుతో చెడిన తర్వాత పార్టీకి దూరమవ్వగానే జగన్మోహన్ రెడ్డి నెత్తిన పెట్టుకుంటారని అనుకున్నారు.
అయితే వారనుకున్నట్లు జరగలేదు. ఎందుకంటే అనధికారికంగా వైసీపీతోనే నలుగురు ఉన్నా వైసీపీ నేతలు, క్యాడర్ తో మాత్రం కలవలేకపోతున్నారు. ఈ నలుగురి ఆధిపత్యాన్ని ఆయా నియోజకవర్గాల్లోని నేతలు అంగీకరించలేదు. దాంతో రెగ్యులర్ గా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాలు గమనించిన జగన్ కూడా టీడీపీ ఎంఎల్ఏలకు పార్టీపరంగా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు.
చీరాల, గన్నవరం నియోజకవర్గాల్లో కొంతవరకు వంశీ, కరణం మాట చెల్లుబాటు అవుతోందని సమాచారం. వలస ఎంఎల్ఏకు పార్టీ నేతలు+క్యాడర్ కు ఎక్కువగా గొడవలు జరుగుతున్న నియోజకవర్గం రాజోలనే చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలులో జనసేన తరపున రాపాక వరప్రసాద్ గెలిచారు. గెలిచిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంఎల్ఏకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవటంతో రాపాక వైసీపీ వైపు వచ్చేశారు.
రాపాక కూడా ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయలేదు కానీ తనను తాను వైసీపీ ఎంఎల్ఏగానే ప్రొజెక్టు చేసుకుంటున్నారు. దాంతో రాజోలు వైసీపీ నేతలకు రాపాకకు ఎక్కడా పడటం లేదు. దానికితోడు వైసీపీలోనే మూడు వర్గాలు ఉండటంతో వాళ్ళకి-రాపాకకు మధ్య ప్రతిరోజు ఏదో విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళ పరిస్థితి ఇప్పుడెలా తయారైందంటే వచ్చే ఎన్నికలకు తమ పార్టీల తరపున పోటీ చేసే అవకాశం లేదు. అలాగని వైసీపీలో టికెట్లిస్తారో లేదో ఇచ్చినా గెలుస్తారో లేదో తెలియడం లేదు. దాంతో రెంటికి చెడ్డ రేవడి లాగా తయారైందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates