మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఏమాత్రం నచ్చని వ్యక్తుల్లో పరకాల ప్రభాకర్ ఒకరు. పొలిటీషియన్ కమ్ పొలిటికల్ అనలిస్ట్ అయిన పరకాల ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీకి ఇచ్చిన షాక్ ఎలాంటిదో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పార్టీలో చేరిన మేధావి వర్గంలో ఒకడిగా పరకాలకు మంచి గౌరవమే దక్కింది. కానీ కొంత కాలానికే ప్రజారాజ్యం నుంచి బయటికి వచ్చేసిన ఆయన.. తాను నిష్క్రమిస్తున్న విషయాన్ని అదే పార్టీ ఆఫీస్‌లో కూర్చుని వెల్లడించారు. అంతటితో ఆగకుండా ప్రజారాజ్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేశారు.
ముఖ్యంగా ప్రజారాజ్యం ఒక విష వృక్షమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. ఆపై అల్లు అరవింద్ తదితరులు ఆయనపై తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేయడం, తదనంతర పరిణామాలు తెలిసిందే.
ఒకప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆయన.. ప్రజారాజ్యం నుంచి బయటికొచ్చేసిన కొన్నేళ్లకు తెలుగుదేశం పార్టీ మద్దతుదారుగా మారారు. గత ప్రభుత్వంలో సలహాదారుగా కూడా పని చేశారు. కట్ చేస్తే ఇప్పుడు ఆయనకు, జనసేన కార్యకర్తలకు మధ్య సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. మూణ్నాలుగు రోజుల నుంచి ఈ యవ్వారం నడుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక కళాకారుడికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ చూశారా ఇతడి ప్రతిభ అంటూ కామెంట్ పెట్టారు పరకాల ట్విట్టర్లో. ఐతే ఈ ప్రతిభది ఏముంది.. నీ ప్రతిభ ఏమైనా తక్కువా అంటూ ప్రజారాజ్యం పార్టీకి ఆయన పొడిచిన వెన్నుపోటును గుర్తు చేస్తూ మెగా అభిమానులు ఆయనపై విరుచుకుపడ్డారు.
ముఖ్యంగా జనసైనికులు ఆయనపై తీవ్ర స్థాయిలోనే దాడి చేశారు. పరకాల ఊరుకోకుండా ఒక్కొక్కరికి బదులిస్తూ వెళ్లారు. చిరంజీవి పార్టీని అమ్ముకున్నాడని.. పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయాడని పేర్లు చెప్పకుండా పరోక్షంగా ఎద్దేవా చేస్తూ ఆయన పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. రాను రాను ఆయన కూడా స్వరం పెంచారు. ఆయనకు జనసైనికులు దీటుగానే బదులిస్తున్నారు. రోజు రోజుకూ వ్యవహారం ముదిరి వాదోపవాదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇది డైలీ సీరియల్ తరహాలో మారిపోయింది. పరస్పరం రెచ్చగొట్టుకుంటూ సాగుతున్న ఈ గొడవకు ఎప్పుడు తెరపడుతుందన్నదే తెలియడం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates