కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ కకావికలమవుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కరోనాకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో.. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న మందులతో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నాయి. కరోనాను కట్టడి చేయడంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ కీలకమైన పాత్ర పోషిస్తుండడంతో ఇపుడు వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
అగ్రరాజ్యం అమెరికా దగ్గర కూడా సరిపడినంత హైడ్రాక్సీ క్లోరోక్విన్ లేకపోవడంతో…మిత్రదేశం భారత్ ను ట్రంప్ సాయం అడిగారు. ఒకింత బెదిరింపు ధోరణిలో ట్రంప్ అడగడంతో మోడీ …అమెరికాతో పాటు నేపాల్, మరి కొన్ని దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను సరఫరా చేశారు.
అయితే, భారత్ అవసరాలకు అదనంగా 25 శాతం హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను ఉంచుకున్న తర్వాతే…మిగిలిన దానిని ఇతర దేశాలకు మానవతా దృక్ఫథంతో అందించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తమకూ ఆ మందు సరఫరా చేయాలంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో ప్రధాని మోడీని రిక్వెస్ట్ చేశారు.
మలేరియా నివారణ ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్ ను కరోనా చికిత్స కోసం వాడుతున్న నేపథ్యంలో దానికి డిమాండ్ పెరిగింది. అయితే, భారత్ దగ్గర వాటి నిల్వలు సమృద్ధిగా ఉండడం వల్ల చాలా దేశాలు భారత్ సాయం కోరుతున్నాయి. అయితే, కరోనా భారత్ లోనూ వ్యాప్తి చెందుతున్న వేళ…ఆ డ్రగ్ ఎగుమతులను భారత్ నిలిపి వేసింది. అయితే, తాజాగా మానవతా దృక్పథంతో ఎగుమతులపై సడలింపు ఇవ్వడంతో…ఆ డ్రగ్ కోసం భారత్‌ను అభ్యర్థిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది.
హైడ్రాక్సీక్లోరోక్విన్‌కు తమకు కూడా సరఫరా చేయాలని కోరిన బ్రెజిల్ అధ్యక్షడు బోల్సోనారో…అందుకోసం రామాయణాన్ని ఉదహరించారు. రామాయణంలో హనుమంతుడు హిమాలయ పర్వతాల నుంచి పవిత్ర ఔషధం సంజీవనిని తెచ్చి రాముడి సోదరుడు లక్ష్మణుడి ప్రాణాలు కాపాడారని బోల్సోనారో చెప్పారు.. అనారోగ్యంతో ఉన్నవారిని యేసుక్రీస్తు స్వస్థపరిచాడని, అదే విధంగా ఆపదలో ఉన్న బ్రెజిల్ ను హనుమంతుడిలా భారత్ కాపాడాలని మోడీకి రిక్వెస్ట్ చేశారు.
భారత్ ఇచ్చే భరోసాయే అత్యున్నత గౌరవంగా భావిస్తానని ప్రధాని మోడీకి రాసిన లేఖలో బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో పేర్కొన్నారు. మరి, బ్రెజిల్ అధ్యక్షుడు చెప్పిన రామాయణానికి మోడీ ఎలా స్సందిస్తారో వేచి చూడాలి.