నా బాధ గోడ‌కు చెప్పుకోనా అంటోన్న ఏపీ మంత్రి ?

విశాఖ జిల్లా మొత్తానికి ఆయనే ఏకైక మంత్రి. గతంలో టీడీపీ టైమ్ లో అయితే అవంతి గురువు గంటా శ్రీనివాసరావుకు రూరల్ జిల్లాలో అయ్యన్నపాత్రుడుతో పోటీ ఉండేది. దాంతో ఆయన సగం మంత్రిగానే ఉండిపోయారు. అయితే గంటా రాజకీయ చాతుర్యంతో, తనదైన వ్యూహాలతో రాష్ట్ర స్థాయిలోనే ఒక దశలో చక్రం తిప్పారు. చంద్రబాబు వద్ద తన ప్రయారిటీ ఏ మాత్రం దెబ్బ తినకుండా చూసుకున్నారు. కానీ ఇపుడు అవంతికి మాత్రం అలాంటి సీన్ కనిపించడంలేదు. అవంతికి జిల్లాలో మరో మంత్రి పోటీగా లేరు. కానీ అంతకంటే అతి పెద్ద పోటీయే ఆయనకు ఉంది.

అదే ఎంపీ విజయసాయిరెడ్డి. విజయ‌సాయిరెడ్డి మొత్తం అధికారాన్ని తన గుప్పిట ఉంచుకున్నారు. ఏ విషయం అయినా విజయసాయిరెడ్డే చూడాలి. ఆ సంగతి తెలిసి అధికారులు కూడా ఆయన్నే కలుస్తారు. ఆయన మాటే వింటారు. ఆయన తప్ప వైసీపీలో మరెవరినీ గుర్తించాల్సిన వసరం లేదని కూడా భావిస్తున్నారు. ఈ పరిణామాలతో మంత్రిగా అవంతి ఉన్నా కూడా అధికారాలు మాత్రం లేవనే అంటున్నారు. ఆయన విజయసాయిరెడ్డికి నీడగా మారిపోయారని కూడా అంటున్నారు. విజ‌య‌సాయి రెడ్డి పేరుకు మాత్ర‌మే రాజ్య‌స‌భ ఎంపీ అయినా ఉత్త‌రాంధ్ర‌లో చిన్న ప‌నికూడా ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతోంది.

విజ‌య‌సాయి దెబ్బ‌తో చివ‌ర‌కు విశాఖ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ పేరు కూడా ఎవ్వ‌రూ త‌ల‌వ‌డం లేదు. మరో నాలుగు నెలల్లో రెండున్నరేళ్ల పాలన పూర్తి కావస్తోంది. అయితే మంత్రిగా అవంతి ఏం సాధించారు అంటే ఏమీలేదు అనే చెప్పుకోవాల్సివస్తోంది అంటున్నారు. ఆయన కీలకమైన పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ విశాఖ లాంటి సిటీలో టూరిజం హబ్ గా చేస్తామని చెబుతున్న చోట కనీసం ఒక్క ప్రాజెక్ట్ ని కూడా కొత్తగా తీసుకురాలేకపోయారు. గతంలో విశాఖ పర్యాటకరంగానికి సంబంధించి పెట్టుబడుల కోసం సదస్సులను విశాఖలో టీడీపీ నిర్వహించింది.

కొంత‌లో కొంత అక్క‌డ ప‌ర్యాట‌కంగా అభివృద్ధి జ‌రిగింది. అందుకే టాలీవుడ్ అగ్ర నిర్మాత‌లు సైతం టీడీపీ ప్రభుత్వ హ‌యాంలో అక్క‌డ పెట్టుబ‌డులు పెట్టారు. ఇపుడు మంత్రి గా అవంతి ఉన్నా కూడా ఆ పాటి కూడా చేయడంలేదని విమర్శలు ఉన్నాయి. అయితే అధికారులు ఎవరూ తన మాట వినడంలేదని అవంతి తెగ బాధపడుతున్నారు. ఈ మధ్య ఆయన పార్టీ నాయకులతో తన గోడు వెళ్ళబోసుకుంటూ నేను కూడా మీలాగే.. నా బాధ గోడ‌కు చెప్పుకోనా అన‌డాన్ని బ‌ట్టి చూస్తేనే ఆయ‌న ఎంత అసంతృప్తితో ఉన్నారో ? తెలుస్తోంది.