వైరల్ వీడియో.. క్యాబ్ డ్రైవర్‌పై అమ్మాయి దౌర్జన్యం

సోషల్ మీడియాలో నిన్నట్నుంచి ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో నడి రోడ్డు మీద ఒక క్యాబ్ డ్రైవర్‌పై ఓ యువతి విచక్షణా రహితంగా దాడికి పాల్పడుతోంది. అతణ్ని ఎలా పడితే అలా కొట్టేస్తోంది. చుట్టూ ఉన్న వాళ్లంతా వేడుక చూస్తున్నారే తప్ప ఆ అమ్మాయిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఆ అమ్మాయి నుంచి తనను కాపాడాలని క్యాబ్ డ్రైవర్ వేడుకుంటుంటే.. ఓ వ్యక్తి ఆమెను ఆపబోతే తన మీద కూడా ఆ యువతి దాడికి పాల్పడింది.

ఇది ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో జరిగిన ఉదంతంగా తెలుస్తోంది. కచ్చితంగా ఏ రోజు ఈ ఘటన జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. కానీ ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ ప్రధాన కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రికార్డయిన సీసీ టీవీ ఫుటేజ్, ఓ వ్యక్తి తీసిన వీడియోలను పరిశీలిస్తే మొత్తం ఉదంతంలో క్యాబ్ డ్రైవర్ తప్పేమీ లేదని స్పష్టమవుతోంది.

ముందుగా సిగ్నల్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తే జీబ్రా క్రాసింగ్‌ మీద ఆ అమ్మాయి నడుచుకుని వెళ్తుండగా.. మిగతా వాహనాలతో పాటే సిగ్నల్ పడ్డా ఆపకుండా సదరు క్యాబ్ డ్రైవర్ సైతం కారును ముందుకు పోనిచ్చాడు. ఐతే అమ్మాయి అడ్డం రావడంతో అతను కారు ఆపేశాడు. అతను ఆమెకు డ్యాష్ ఇచ్చినట్లుగా కూడా ఏమీ కనిపించలేదు.

ఐతే అతడి కారును ఆపి హడావుడి చేసిన అమ్మాయి.. అతణ్ని బయటికి రప్పించింది. తర్వాత అతణ్ని కొట్టడం మొదలుపెట్టింది. వీడియోలో కనిపిస్తున్నది గమనిస్తే కనీసం పదిసార్లు అతణ్ని చెంపమీద కొట్టింది. అతను ప్రతిఘటించకుండా ఉండిపోయాడు. ఆ డ్రైవర్ మొబైల్‌ను సైతం ఆ అమ్మాయి పగలగొట్టిందట. టీషర్ట్ పట్టుకుని లాగేస్తూ తనను అమ్మాయి కొడుతుంటే.. తననెవరైనా కాపాడాలంటూ అతను వేడుకోవడం వీడియోలో కనిపించింది. ఇంతలో ఓ వ్యక్తి ఆమెను ఆపబోయాడు. దీంతో అతణ్ని కూడా షర్టు పట్టుకుని కొట్టడం మొదలుపెట్టింది. వీడియో చూస్తే ఆ అమ్మాయిదే నూటికి నూరు శాతం తప్పని స్పష్టమవుతోంది. దీంతో నెటిజన్లు ఆమె మీద విరుచుకుపడుతున్నారు. ఆమెను అరెస్ట్ చేయాలంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి నిన్నట్నుంచి ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. మరి పోలీసులేం చేస్తారో చూడాలి.