మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిందా. ఆయన ఇన్నాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందా అంటే టీడీపీలో ఆయన వర్గం అదేనంటోంది. దేవినేని ఉమ ఓడిన తరువాత ప్రతీ రోజూ టీవీల్లోకి వచ్చి చేయాల్సిన రచ్చ అంతా చేస్తున్నారు. ఆయన వైసీపీ సర్కార్ మీద ప్రతీ రోజూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే ఉమకు సొంత పార్టీలోనే సరైన సహకారం లభించడంలేదు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఉమది దాదాపుగా ఒంటరి పోరుగానే చెప్పాలి. ఆయన మంత్రిగా అయిదేళ్ల పాటు అధికారాన్ని చలాయించినపుడు మిగిలిన వారిని అసలు పట్టించుకోని కారణంగా ఇపుడు వారు అంతా దూరం అయ్యారని చెబుతారు.
మరో వైపు చంద్రబాబు కూడా ఉమకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారని గుస్సా అయిన వారూ ఉన్నారు. ఈ నేపధ్యంలో ఉమ ఏం మాట్లాడినా టీడీపీలో కోరస్ పలికేవారు ఎవరూ లేరు. ఈ పరిణామాల నేపధ్యంలో ఉమ మీద కేసులు బనాయించి మరీ జగన్ సర్కార్ అరెస్ట్ చేయడంతో ఆయన ఇపుడు జైలులో ఉన్నారు. ఇది హాట్ టాపిక్ గా మారింది. హాట్ హాట్ పాలిటిక్స్ కి కేంద్ర బిందువుగా ఎపుడూ ఉండే కృష్ణా జిల్లాలో తెలుగుదేశానికి కూడా ఒక్క దెబ్బకు బూస్టప్ ఇచ్చినట్లుగా అయింది. మైలవరంలో ఉమ ఓడిన తరువాత నుంచి పోరాడుతున్నా కూడా ఇది ఆయన రాజకీయాన్ని మలుపు తిప్పే అరెస్ట్ గానే చూస్తున్నారు. దీంతో ఉమను వ్యతిరేకించే సొంత పార్టీ వర్గాలు కూడా ఇపుడు తప్పని సరిగా మద్దతు ఇవ్వాల్సివస్తోంది.
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా రాజకీయాల్లో ఉమా సొంత పార్టీ నేతలను అందరిని పక్కన పెట్టి మరీ రాజకీయం చేశారు. అందుకే ఉమా అంటే సొంత పార్టీలోనే ఏ ఒక్కరికి గిట్టదు. అయితే ఇప్పుడు ఆ నేతలు అందరూ కూడా ఆయనకు అనుకూలంగా తన గొంతును సవరించుకోవాల్సివస్తోంది. ఇంకో వైపు చంద్రబాబు కూడా విజయవాడ వచ్చి ఉమ కుటుంబాన్ని పరామర్శించడం ద్వారా ఆయన విలువ పార్టీలో ఎంతో చెప్పకనే చెప్పేసారు. ఇక రానున్న కాలంలో ఉమ దూకుడుగా పాలిటిక్స్ చేయడానికి ఈ అరెస్ట్ చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు.
మైలవరంలో వసంత క్రిష్ణ ప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఉమా అరెస్ట్ ముందు వరకూ చప్పగా ఉన్న రాజకీయం కాస్తా ఇపుడు భగ్గుమంటోంది. టీడీపీ శ్రేణులు కూడా అలెర్ట్ అవుతున్నాయి. మొత్తానికి నిద్రాణంలో ఉన్న టీడీపీని తట్టి లేపిన పుణ్యం వైసీపీదే అంటున్నారు. మరిది వైసీపీకి పొలిటికల్ గా రాంగ్ స్టెప్పేనా అన్నది అయితే చర్చగానే ఉంది.