ప్రకటనలదేముంది ? పైసా ఖర్చులేదు కాబట్టి ఎన్నైనా చేసేస్తారు. అదే చేసిన ప్రకటనలను అమల్లోకి తేవాలంటే అందుబాటులో నిధులుండాలి. మరి ఆ నిధుల సంగతేమిటి ? ఇపుడిదే సమస్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పట్టిపీడిస్తోంది. ఇప్పుడిదంతా ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం 3.144 శాతం డీఏని పెంచుతు ప్రకటించింది. తాజాగా పెంచిన డీఏలను 2019 జనవరి నుండి వర్తింపచేసేట్లుగా ఉత్తర్వులు జారీచేసింది.
అంతా బాగానే ఉంది కానీ ఇప్పటికే పెండింగ్ లో ఉన్న డీఏల అమలు మాటేమిటి ? ఇప్పటికే సుమారు ఏడు డీఏలు బకాయిలున్నాయి. వీటిల్లో 3 డీఏలు చంద్రబాబునాయుడు హయాంలోనే బకాయిలుపడ్డాయి. మిగిలిన నాలుగు డీఏలు గడచిన రెండేళ్ళుగా బకాయిలున్నాయి. ఉద్యోగులకైనా, పెన్షనర్లకైనా ప్రభుత్వం డీఏలను బకాయిపెట్టిందంటేనే ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితి బావోలేదని అర్ధమైపోతుంది.
పాత బకాయిలే చెల్లించని ప్రభుత్వం తాజాగా ప్రకటించిన డీఏని సకాలంలో చెల్లిస్తుందనే గ్యారెంటీ ఏమిటి ? పలానా తేదీ నుండి వర్తిస్తుందని, ఫలానా తేదీన చెల్లిస్తామని ప్రకటన చేయటం చాలా సులభం. అయితే చేసిన ప్రకటన అమల్లోకి రావాలంటేనే చాలా కష్టం. ప్రభుత్వ ప్రస్తుత ఆర్ధిక పరిస్దితిని గమనించిన తర్వాత తాజాగా ప్రకటనించిన డీఏ అమలుపై అనేక అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఏదేమైనా ప్రభుత్వం డీఏని ప్రకటించింది కాబట్టి ఉద్యోగసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అదే అమల్లోకి కూడా తెచ్చేస్తే ఇంకా హ్యాపీగా ఫీలవతారు ఉద్యోగులు. మరి ఉద్యోగులను హర్షానికి మాత్రమే ప్రభుత్వం పరిమితం చేస్తుందా లేకా నిజంగానే హ్యాపీ ఫీలయ్యేట్లు చేస్తుందా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్సే.
Gulte Telugu Telugu Political and Movie News Updates