ముఖ్యమంత్రి జగన్ విషయంలో మంత్రులే అయినా.. చాలా మంది ఆచి తూచి వ్యవహరిస్తారు. అనేక విషయాల్లో ఆయనను సమర్ధించేవారు.. ఆయనతో చనువుగా ఉండేవారు.. కూడా వివాదాస్పద విషయాల్లో మాత్రం ఎవరూ నోరు మెదిపే ధైర్యం చేయరు. మరీ ముఖ్యంగా బీజేపీ వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవడం లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా మంత్రులు కూడా ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. కానీ, తాజాగా ఓ మంత్రి మాత్రం ఓ వివాదాస్పద విషయంలో జగన్కు సర్టిఫికెట్ ఇచ్చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ నేతలు… మత మార్పిడులపై తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తున్నారు.
జగన్ సర్కారులో హిందువులకు, హిందూ ఆలయాలకు రక్షణ కొరవడిందని.. హిందువులపై దాడులు పెరుగుతున్నాయని .. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో వైసీపీ నాయకులు ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ నేతలు కూడా మౌనంగా ఉన్నారు. ఏం మాట్లాడితే.. ఏం వస్తుందోనని.. భయపడుతున్నారు. ముఖ్యంగా సలహాదారు సజ్జల కూడా ఈ విషయంలో తాము తప్పు చేయడం లేదని.. కానీ.. బీజేపీ నేతలు.. అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కానీ.. ఎక్కడా అనలేదు. కానీ, ఈ విషయంలో ఒకే ఒక్క మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇప్పటి వరకు ఎవరూ దీనిపై మాట్లాడక పోవడం.. ఇప్పుడు బాలినేని సీఎం జగన్కు సర్టిఫికెట్ ఇవ్వడం వంటివి ఆసక్తిగా మారాయి.
రాష్ట్రంలో మత మార్పిడిలపై బీజేపీ నేతలు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఒకవేళ మత మార్పిడిలు చేయాలంటే జగన్ బంధువులమైన తామే ముందు మతం మారాలి కదా అని ప్రశ్నించారు. తామంతా హిందువలమేనని.. బీజేపీ ఆరోపణల్ని ప్రజలు పట్టించుకోరన్నారు. కుల, మతాలకు తీతంగా వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని.. ఫాదర్లు, మౌజమ్లతో పాటు పూజారులకు ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోందని అన్నారు. దేశంలో ఎవరు ఇష్టం వచ్చిన మతాన్ని వారు అనుసరించవచ్చన్నారు. ముఖ్యమంత్రి జగన్ తిరుపతితో సహా అన్ని దేవాలయాలకు వెళతారని.. అన్ని మతాలను సమానంగా చూస్తారన్నారు.
సోము వీర్రాజు వ్యాఖ్యలు రాజకీయ లబ్ధి కోసమేనని.. బలవంతం ఎవరూ మత మార్పిడిలు చేయరన్నారు. 2014 ఎన్నికలకు ముందు కూడా ఇలాగే మతం అంశాన్ని ముందుకు తెచ్చారని.. ప్రజలు విశ్వసించలేదన్నారు. బీజేపీ పద్ధతిని మార్చుకోవాల న్నారు.. సోము వీర్రాజు ఆరోపణలు చేస్తున్నట్లు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని బాలినేని చెప్పడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరి దీనిపై బీజేపీ నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి. నిజానికి మత మార్పిడులపై జాతీయ ఎస్సీ కమిషన్ కూడా రాష్ట్రానికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఈ తరహా ధ్రువపత్రం ఇవ్వడం.. ద్వారా బాలినేని ఏం కోరుకుంటున్నారనేది ఆసక్తిగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates