అవును కేసీయార్ ఎంతో ప్రిస్టేజిగా తీసుకున్న దళితబంధు పథకం ఇపుడు తలనొప్పులు తెస్తున్నట్లే ఉంది. దళితులను ఆకర్షించేందుకు కేసీయార్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు కూడా చెప్పారు. ఉపఎన్నికలు జరగబోతున్న కారణంగా హుజూరాబాద్ ను కేసీయార్ పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నారని అందరికీ అర్ధమైపోయింది.
అయితే ఎవరు ఊహించని విధంగా రెండువైపుల నుండి సమస్యలు మొదలయ్యాయి. అదేమిటంటే మొదటిదేమో దళిత సంఘాల నుండి మొదలైంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 100 కుటుంబాలకు మాత్రమే కాకుండా మొత్తం దళితులందరికీ పైలెట్ ప్రాజెక్టును వర్తింపచేయాలంటు దళితసంఘాలు డిమాండ్లు మొదలుపెట్టాయి. అలాగే హుజూరాబాద్ నియోజకవర్గం మాత్రమే కాదని రాష్ట్రం మొత్తానికి ఒకేసారి పథకాన్ని అమల్లోకి తేవాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి.
ఇక రెండో సమస్య ఏమిటంటే దళితులకు దళితబంధు పథకం పెట్టినట్లుగానే బీసీలకు కూడా ఓ బంధును అమల్లోకి తేవాలంటు కమ్మరి, కుమ్మరి, యాదవ, గౌడ్, నాయీబ్రాహ్మణ లాంటి బీసీల్లోని ఉపకులాలన్నీ డిమాండ్లు మొదలుపెట్టాయి. ఎస్సీలతో పోల్చుకుంటే బీసీల్లోని ఉపకులాల్లోను ఆర్ధికంగా వెనకబడిన లక్షలాది కుటుంబాలున్నట్లు వాళ్ళు చెబుతున్నారు. దళితులను ఆర్ధికంగా ఆదుకుంటున్నట్లే తమను మాత్రం ఎందుకు ఆదుకోరంటు కేసీయార్ ను నిలదీస్తున్నారు.
ఇటు దళితులు, అటు బీసీల నుండి పెరిగిపోతున్న డిమాండ్లు చూస్తుంటే చివరకు కొత్త పథకమే కేసీయార్ ను ఉపఎన్నికలో ముంచేస్తుందా అనే డౌటనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే హుజూరాబాద్ లో ఎస్సీల ఓట్లు 45 వేలైతే బీసీల ఓట్లు సమారు లక్షదాకా ఉన్నాయి. ఈ బీసీల ఓట్లను నమ్ముకునే ఈటల రాజకీయం చేస్తున్నారు. ఎందుకంటే ఈటల కూడా బీసీయే కాబట్టి. బీసీల్లో ఈటలకు మంచి పట్టుందన్న విషయం తెలుసుకాబట్టే కేసీయార్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే అనవసరంగా దళితబంధు పథకాన్ని ప్రకటించారా అనే ప్రచారం కూడా పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates