కరోనా టెస్టులపై సుప్రీం కీలక సూచన

దేశవ్యాప్తంగా కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో మరింత మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలూ నిర్ణయించాయి. ఈ నేపథ్యంలోనే నిర్దేశించిన ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు కొన్ని ప్రైవేటు ల్యాబ్ లలోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమ వంతు వచ్చేసరికి కొంచెం ఆలస్యమవుతుందేమోనని భావించిన వారు…ప్రైవేటు ల్యాబ్ లలో టెస్టులు చేయించుకుంటున్నారు. ప్రైవేటు ల్యాబుల్లో ఒక్కో టెస్టుకు రూ.4500 వసూలు చేస్తున్నాయి. దీంతో, సామాన్యులకు కరోనా పరీక్షలు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు ల్యాబుల్లో కరోనా పరీక్షలు ఉచితంగా నిర్వహించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో శశాంక్ డియో అనే లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే సామాన్య ప్రజలు…చేతకాకపోయినప్పటికీ ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. ఇది జీవించే హక్కును కాలరాయడమే అవుతుందని పిటిషనర్ తెలిపారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలకమైన సూచనలు చేసింది. కోవిడ్-19 పరీక్ష సౌకర్యం పౌరులందరికీ ఉచితంగా లభించేలా చూడాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు కోరింది. ప్రైవేటు ల్యాబ్‌ లలో కోవిడ్-19 పరీక్షల కోసం రూ.4500 వసూలు చేస్తున్నారని, ఇది సామాన్యులకు భారంగా మారిందని సుప్రీం అభిప్రాయపడింది. ఆయా ప్రైవేటు ల్యాబ్‌లకు కేంద్రం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేసే అవకాశాలను పరిశీలించాలని జస్టిస్ అశోక్ భూషణ్, ఎస్.రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం..కేంద్రం ప్రభుత్వాన్ని కోరింది. కరోనా టెస్టుల కోసం పౌరులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండకూదని పేర్కొంది. దాంతోపాటు, టెస్టుల కోసం ప్రైవేటు ల్యాబ్‌లు అధిక మొత్తాన్ని వసూలు చేయకుండా నిరోధించాలని సుప్రీం సూచించింది.