‘పోల‌వ‌రం’పై సాయిరెడ్డి ఎత్తుగ‌డ విక‌టించిందా..?


రాష్ట్రానికి జీవ‌నాడి అయిన‌.. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాజ‌కీయం చేయాల‌ని భావించిన వైసీపీ ఎదురు దెబ్బ‌త‌గిలిందా ? ఆ పార్టీ ఎంపీ.. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. విజ‌యసాయిరెడ్డి ఒక‌టి త‌లిస్తే.. మ‌రొక‌టి జ‌రిగిందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు వైసీపీ సీనియ‌ర్లు. పోల‌వ‌రం విష‌యాన్ని గ‌త చంద్ర‌బాబు స‌ర్కారు సీరియ‌స్‌గానే తీసుకుంది. ఈ క్ర‌మంలో వారం వారం పోల‌వ‌రం ప‌నుల‌ను చంద్ర‌బాబు స‌మీక్షించేవారు. అవ‌స‌ర‌మైన ప్ర‌తిసారీ.. ఆయ‌నే నేరుగా ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లి ప‌నులు ప‌రిశీలించారు. ఇక‌, కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వ‌కున్నా.. కూడా ప‌నులు ముందుకు సాగేలా కాంట్రాక్ట‌ర్ సంస్థ‌ల‌ను ఒప్పించారు.

ఈ క్ర‌మంలోనే పెరిగిన ద్ర‌వ్యోల్బ‌ణం నేప‌థ్యంలో చంద్ర‌బాబు హ‌యాంలోనే పోల‌వ‌రం అంచాన‌ల‌ను 20 వేల కోట్ల నుంచి 47 వేల కోట్ల‌కు ఆ త‌ర్వాత 55 వేల కోట్ల రూపాయ‌ల‌కు పెంచారు. ఈ క్ర‌మంలో కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకునే క్ర‌మంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డంతో వైసీపీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చింది. దీనిని త‌మ తండ్రిగారే స్థాపించారు కాబ‌ట్టి.. త‌మ హ‌యాంలోనే పూర్తిచేస్తామ‌ని.. నిధులు కూడా తెస్తామ‌ని.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌దే ప‌దే ప్ర‌క‌టించారు. దీనిపై ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. కేంద్ర పెద్ద‌ల వ‌ద్ద మాట్లాడుతున్నామ‌ని.. 55 వేల కోట్ల రూపాయ‌ల‌కు కేంద్రాన్ని ఆమోదించేలా ఒప్పిస్తున్నామ‌ని.. మంత్రులు బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాద‌వ్ లు కూడా ప్ర‌క‌టిస్తూ.. వ‌చ్చారు.

అయితే.. దీనిపై ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మీరు ఢిల్లీ వెళ్లింది.. కేంద్రంతో మీ కేసుల విష‌యంలో రాజీ చేసుకునేందుకేన‌ని.. మాజీ మంత్రి దేవినేని ఉమా వంటివారు ఎప్ప‌టిక‌ప్పుడు విమ‌ర్శ‌లు సంధించారు. దీంతో ఒకింత ఆత్మ ర‌క్షణ‌లో ప‌డిన వైసీపీ స‌ర్కారు.. దీనికి కేంద్రం నుంచే స‌మాధానం ఇప్పించే ప్ర‌య‌త్నం చేసింది. ఈ క్ర‌మంలోనే ముందు వెనుక ఆలోచించ‌కుండా.. అస‌లు క్షేత్ర‌స్థాయిలో కేంద్రం ద‌గ్గ‌ర ఏం జ‌రుగుతోందో.. కూడా తెలియ‌కుండానే.. సాయిరెడ్డి పార్ల‌మెంటు వేదిక‌గా నోటీసు ఇచ్చారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యంలో గుంభ‌నంగా ఉన్న కేంద్రం పార్ల‌మెంటులో నిజానిజాలు చెప్ప‌క త‌ప్ప‌లేదు. దీంతో వైసీపీ ఇప్పుడు పూర్తిగా విఫ‌ల‌మైంద‌నే వాద‌న వినిపిస్తోంది.

ఇటీవ‌ల పార్ల‌మెంటు వేదిగా జ‌రిగిన ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో సాయిరెడ్డి అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి స‌మాధానం ఇచ్చారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి తాము అంచ‌నాలు పెంచేది లేద‌న్నారు. అంతేకాదు.. అస‌లు ఈ ప్ర‌తిపాద‌న ఏదీ కూడా త‌మ‌కు రాలేద‌ని చెప్పారు. మ‌రోవైపు.. 2014లో విభ‌జ‌న చ‌ట్టం స‌మ‌యంలో వేసిన అంచ‌నా మేర‌కు 22 వేల కోట్ల రూపాయ‌ల‌కు మాత్ర‌మే తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని..పునరావాసం.. వంటి ఖ‌ర్చును రాష్ట్ర స‌ర్కారే భ‌రించాల‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ నేత‌లు చెప్పిన మాట‌లు అన్నీ కూడా తేలిపోయాయి. ముఖ్యంగా సాయిరెడ్డి చెబుతూ.. వ‌చ్చిన‌.. మేం ఢిల్లీలో పోల‌వ‌రం పై మాట్లాడుతున్నామ‌న్న ఆయ‌న వ్యాఖ్య‌లు నిజం కాద‌ని తేలిపోయింది. దీంతో ఇప్పుడు వైసీపీ ప‌రువు అన్ని విధాలా పోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి దీనిపై సీఎం జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.