జగన్ ఆ తప్పు చేయొద్దు – పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల అమ్మకాలకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా శ్రీ వేంకటేశ్వరుని పేరిట వివిధ రాష్ట్రాల్లో ఉన్న భూముల్ని కూడా అమ్మడానికి సన్నాహాలు మొదలయ్యాయి. టీటీడీ ఈ మేరకు భూముల వేలానికి బిడ్లు కూడా ఆహ్వానించింది. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.

జగన్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా స్పందించాడు. ప్రభుత్వ తీరును తప్పుబట్టాడు. వైకాపా ప్రభుత్వం టీటీడీ భూముల్ని అమ్మాలనుకోవడం పెద్ద తప్పిదమని పవన్ అన్నాడు. ఇది శ్రీవారి భక్తుల మనోభావాలను, నమ్మకాల్ని దెబ్బ తీస్తుందని చెప్పాడు.

దేశంలో ప్రతి హిందూ ధార్మిక సంస్థలు టీటీడీ వైపే చూస్తాయని.. దాన్నే ఆదర్శంగా తీసుకుంటాయని.. అలాంటి సంస్థలకు టీటీడీ ఆదర్శ ప్రాయంగా ఉండాలని పవన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు టీటీడీ భూముల అమ్మకానికి సిద్ధమైతే.. మిగతా సంస్థలూ ఇదే బాట పడతాయని.. ఇది కోట్ల మంది భక్తుల మనోభావాల్ని దెబ్బ తీస్తుందని పవన్ అన్నాడు.

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడిందని, పడుతూ ఉందని.. రాష్ట్రానికి పూర్తి స్థాయి రాజధాని లేదని.. ఆర్థిక వ్యవస్థ దారుణమైన స్థితిలో ఉందని.. ఇలాంటి తరుణంలో పెట్టుబడి దారులు ముందుకు వస్తేనే ఆర్థిక వ్యవస్థ బాగుపడటం, ఉద్యోగాల కల్పన జరగడం సాధ్యమని.. ఇన్వెస్టర్లు రావాలంటే వారికి ప్రభుత్వం భూమి ఇవ్వాలని.. అదే అత్యంత ఆకర్షణీయ మార్గమని.. భూములన్నీ అమ్ముకుంటూ పోతే ఇక ఏం మిగులుతుందని.. పెట్టుబడిదారులు ఎలా వస్తారని పవన్ ప్రశ్నించాడు. జనసేనాని ఆలోచనాత్మకంగానే జగన్ సర్కారుకు ప్రశ్నలు సంధించాడు. దీనిపై ప్రభుత్వం ఏమంటుందో చూడాలి.